బాపట్ల: కర్లపాలెం మండలంలోని పెద్దపులివారిపాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోపాటు పార్టీ నాయకులు కలిపి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె ఆపరేషన్ నిమిత్తం నగదు అందజేసి ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని సూచించారు. వైద్యులతో కోన మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, పేరాల వెంకట సురేష్, ధర్మేంద్ర, ఆట్ల నాగేశ్వరరెడ్డి ఉన్నారు.
గుండెపోటుతో ఎస్‌ఐ మృతి
చీరాల: ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటి వద్ద గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, ఒన్‌టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, టూటౌన్, రూరల్ సీఐలు అశోక్‌కుమార్, శేషగిరిరావులు, ఎస్‌ఐలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1982 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన ఎస్సైగా పదోన్నతి పొంది చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. 42 సంవత్సరాల పాటు పోలీస్‌శాఖలో సేవలందించారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జూదరుల అరెస్ట్
చీరాల: పంట పొలాల వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ బుధవారం అరెస్ట్ చేశారు. చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని పొలాల్లో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు మెరుపుదాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.11,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షేంచేది లేదని హెచ్చరించారు.


