పర్చూరు వాగు విస్తరణం
సర్కారు తీరుపై బాధిత రైతుల మండిపాటు ఎగువన ఉప్పుటూరు–పోతుకట్ల వాగు ఆక్రమణలు తొలగించండి పర్చూరు వాగులో జాతీయ రహదారి పిల్లర్లు వేస్తే నీళ్లు ఎలా వెళతాయి? కారంచేడు సమావేశంలో బాధిత రైతుల ఆగ్రహం
అసలు కారణాలపై దృష్టి ఏదీ?
170 ఎకరాల భూ సేకరణకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం
పర్చూరు వాగు విస్తరణ పేరుతో ప్రభుత్వం భూసేకరణకు దిగడంపై ఈ ప్రాంత రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముంపు నుంచి బయటపడేందుకు వాగు విస్తరణ తప్పనిసరని అధికారులు ప్రతిపాదించారు. ఐతే ఎగువనున్న ఉప్పుటూరు, పోతుకట్ల వాగు ఆక్రమణలు తొలగించకుండా ప్రభుత్వం కారంచేడు ప్రాంత రైతులకు చెందిన విలువైన భూములను వాగు విస్తరణ పేరుతో తీసుకొనే ప్రయత్నాలపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రూ. 20 కోట్లతో పర్చూరు వాగును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కారంచేడు ప్రాంతంలో 170 ఎకరాల భూములు సేకరించాలని డ్రైనేజీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు మండిపడుతున్నారు. అనాలోచితంగా పర్చూరు వాగులో వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారి బ్రిడ్జి పిల్లలర్లు నిర్మించడంతోపాటు ఎగువనున్న ఉప్పుటూరు –పోతుకట్లవాగు కబ్జాకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నది రైతుల అభిప్రాయం. ప్రభుత్వ ప్రతిపాదనలపై వ్యతిరేకతతో ఉన్న రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం సాయంత్రం కారంచేడులో ఏకంగా సమావేశం నిర్వహించారు. ఎగువనున్న ఉప్పుటూరు–పోతుకట్ల వాగు కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అది చేయకపోతే వాగు విస్తరణకు భూములిచ్చేది లేదని తేల్చిచెప్పారు. సమస్యను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని తీర్మానించారు. దీంతో పర్చూరు వాగు విస్తరణ వివాదం ముదురుతోంది. అధికార పార్టీ నేతల కబ్జాలను అధికారులు వదిలేసి... రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పచ్చ నేత కాసుల కక్కుర్తి...
వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారికి సంబంధించిన రెండు భారీ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టారు. వీటికి సంబంధించి దాదాపు 40కి పైగా భారీ పిల్లర్లు పర్చూరు వాగులో నిర్మించారు. వాస్తవానికి పిల్లర్ల వల్ల కాలువ నీరు సజావుగా ఆయకట్టుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కాంట్రాక్టర్ల వద్ద పర్చూరు పచ్చ నేత పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకొని రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించారనే విమర్శలు ఉన్నాయి. వరద సమయంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. అధికవర్షాలు కురిసినప్పుడు కాలువల నీరుతోపాటు పొలాల నుంచి వచ్చే నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితోపాటు ఉప్పుటూరు – పోతుకట్ల వాగు నీరు పర్చూరు వాగులో కలుస్తోంది. ఉప్పుటూరు వాగు కబ్జాకు గురై పర్చూరు వద్ద జాతీయ రహదారి ప్రాంతంలో దాదాపుగా కనుమరుగైంది. దీంతో వరదనీరు ఈ ప్రాంతంలోని పర్చూరు, నాగులపాలెం గ్రామాలను చుట్టుముడుతోంది. పంట పొలాలను నాశనం చేస్తోంది. గత ఏడాది మోంథా తుపాను ప్రభావం వల్ల వరద ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ స్పందించి సకాలంలో జాతీయ రహదారికి రెండు చోట్ల గండి కొట్టించారు. దీంతో వరదనీరు 50 వేల ఎకరాల వరి పొలాలను ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది.
వరద సమస్యలను అధిగమించేందుకు పర్చూరు వాగు విస్తరణ మార్గమని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం రూ. 20 కోట్లతో కారంచేడు నుంచి పెద్దివారిపాలెం వరకు 16 కిలోమీటర్ల మేర కాలువను విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు 170 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేడో రేపో ప్రభుత్వం దీనికి ఓకే చెప్పే అవకాశముంది. మొత్తంగా పర్చూరు వాగులో అడ్డంగా రెండు వంతెనలు నిర్మించకపోయినా... ఉప్పుటూరు– పోతుకట్ల వాగు కబ్జాకు గురికాకుండా అడ్డుకున్నా.. వరద ముంపు ఉండేది కాదని స్థానిక రైతులు చెబుతున్నారు.
పర్చూరు వాగు విస్తరణం


