తెనాలి దేవదాయశాఖ ఈవోపై మంత్రి ఫైర్
తెనాలి: విడవమంటే పాముకు కోపం...కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తెనాలిలో అధికారుల పరిస్థితి తయారైంది. దేవదాయ శాఖ ఈవో తమ్మా శివారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ కావడం, సెలవుపై వెళ్లాలని ఆదేశించడం ఇందుకో నిదర్శనం. దేవదాయ పరిధిలోని శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారమే ఇందుకు కారణం. డిపాజిట్ చెల్లించకపోయినా డిఫాల్టర్ అయినప్పటికీ బినామీకి థియేటర్ లీజు అప్పగించడమే ఈఓ పొరపాటు. నాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి అక్షింతలు వేయించుకోని మరీ మౌనంగా ఉండిపోయినందుకు ఈఓ శివారెడ్డికి ఇప్పుడు మంత్రి మనోహర్‌తో చివాట్లు పడాల్సి వచ్చింది. పైగా బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది సంక్రాంతి కోడిపందేలు వ్యవహారంలో అప్పట్లో ఒక సీఐ సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు ఈఓకు ఆ పరిస్థితి తప్పటం లేదు. దేవాదాయ పరిధిలోని స్థానిక బోసురోడ్డులో గల శ్రీ కాకుమాను శంకరుని సత్రానికి చెందిన శ్రీ సత్యనారాయణ టాకీస్ లీజు పేరుతో టీడీపీ వర్గీయుల ఆధీనంలో కొనసాగుతోంది. కొన్నేళ్లుగా అందులో ఫంక్షన్ హాలు నడుపుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి టాకీస్ లీజు కాల పరిమితి ముగిసింది. లీజుదారుడు అప్పటికీ రూ.12 లక్షలు అద్దె బకాయిలు ఉన్నారు. బకాయిలు వసూలుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. దేవదాయశాఖ హాలు వేలానికి ప్రకటన చేసింది. డిఫాల్టర్ అయిన శ్రీనివాస్‌కు వేలంలో పాల్గొనే అర్హతను కోల్పోవటంతో, అతడి బినామీ వీరయ్య చౌదరి వేలంలో పాడుకున్నారు. నెలకు రూ.1.28 లక్షల వేలంతో దక్కించుకున్నారు. వేలంలో పాల్గొన్న ఇతరులను అంతకుమంచి పాడనివ్వకుండా చేశారని అప్పట్లో ఆరోపణ లొచ్చాయి. ఏదైమైనా డిఫాల్టరయిన శ్రీనివాస్, వీరయ్య చౌదరి ద్వారా మళ్లీ లీజు దక్కించుకున్నారు. నిబంధనలు ప్రకారం రూ.5 లక్షల డిపాజిట్‌ను చెల్లించకుండానే వేలానికి అనుమతించటం, అతడు పేరిట కొట్టేయడం జరిగిపోయింది. దీనికి కారణం ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు పుట్టి శ్రీనివాస్‌కు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అండదండలు ఉండటమేనని అందరికీ తెలుసు. గతంలోని అద్దెను స్వల్పంగా పెంచి శ్రీనివాస్‌కు ఇవ్వాల్సింది పోయి, వే లం ఎందుకు పెట్టావంటూ అప్పట్లో ఈఓపై ఆల పాటి ఆగ్రహించినట్లు కూడా చెబుతారు. ఆలపాటి ఆశీస్సులతో శ్రీ సత్యనారాయణ టాకీస్‌ను వీరయ్య చౌదరి పేరుతో లీజు దక్కించుకున్న పుట్టి శ్రీనివాస్ నెలనెలా చెల్లించాల్సిన అద్దె రూ.1.28 లక్షలు యఽథౠప్రకారం బకాయిల జాబితాలో చేరాయి. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలలకు రూ.10లక్షలకు పైగా చెల్లించాల్సి వుండగా, కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించినట్లు సమాచారం. పాట సమయంలో చెల్లించాల్సిన రూ.5 లక్షలు డిపాజిట్ అతీగతీ లేదు. ఇదిలావుంటే మూడేళ్ల లీజుకు అనుమతిస్తూ దేవదాయశాఖ కమిషనర్ నుండి ఉత్తర్వులు కూడా వచ్చాయి. రాజకీయ సిఫార్సుల్లేకుండా నిబంధనలకూ విరుద్ధంగా అనుమతులు ఎలా వస్తాయనేది ప్రశ్న! శ్రీ సత్యనారాయణ టాకీస్‌కు ఫంక్షన్ హాలుగా నడుపుతున్న పుట్టి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. థియేటర్ వేలం పాటలో డిఫాల్టర్ తరఫున బినామీ లీజులో పాల్గొన్నారని, టీడీపీ మద్దత తో ‘మనోడు’ దక్కించుకున్నాడని ‘సాక్షి’లో అప్పట్లోనే కథనం ప్రచురితమైనంది. ఆ సమయంలో పట్టించుకోని మంత్రి పది నెలలకు సత్యనారాయణ టాకీస్ లీజు వ్యవహారంపై ఈఓను సెలవుపై వెళ్లాలంటూ ఆదేశించడం విశేషం. ఇటీవల ఫ్లెక్సీల వివాదం తరువాత ఈ ఘటన చోటుచేసుకోంది. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న అధికారులు ఇంకెందరో? అన్న చర్చ పట్టణంలో నడుస్తోంది!
సెలవుపై వెళ్లాలని ఆదేశం
సత్యనారాయణ టాకీస్ వేలం
వ్యవహారంలో మంత్రి మనోహర్ ఆగ్రహం
వేలం నాడే ‘సాక్షి’ హెచ్చరించినా ఎవరికీ పట్టని వైనం
ఎమ్మెల్సీ రాజా వర్సెస్ మంత్రి మనోహర్ మధ్య మరో అధికారి బలి?


