రైతులను మోసగించిన విత్తన కంపెనీ
వినుకొండ: విత్తనాలు మేమే ఇస్తాం.. మందులు మేమే ఇస్తాం పంట పండకపోతే నష్టపరిహారం ఇస్తాం అంటూ నమ్మబలికిన ఓ ప్రముఖ విత్తన కంపెనీ, తీరా పంట చేతికి వచ్చే సమయానికి చేతులెత్తేయడంతో ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలోని రైతులు రోడ్డున పడ్డారు. దాదాపు 70 ఎకరాల్లో సాగైన మొక్కజొన్న సాగులో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వివరాల ప్రకారం కొచ్చెర్ల గ్రామ రైతులకు ఓ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు ఆశచూపారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.3,500 చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ పంట వైఫల్యం చెందితే ఎకరానికి రూ.70వేలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడి కోసం ఎకరానికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, తీరా సమయానికి కొందరికి తక్కువ ఇచ్చి, మరికొందరికి అసలు ఇవ్వకుండా కంపెనీ మొఖం చాటేసింది. బాధిత రైతులు కృష్ణా నాయక్, భుక్యా బాలు నాయక్, ఐనాల పుల్లారావు తదితరుల 11 ఎకరాల పొలాలను పరిశీలిస్తే విత్తన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఇవే పొలాల్లో మిరప పంటలు పండగా, ఇప్పుడు కంపెనీ పర్యవేక్షణలో వేసిన మొక్కజొన్న మాత్రం విఫలమైంది. దీన్ని ప్రశ్నిస్తే, మీ భూమిలో లోపం వల్లే పంట రాలేదు అంటూ కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీడ్స్ కంపెనీ యాజమాన్యంపై
చర్యలు తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు చేకూరి సురేష్ రాజా, సత్యనారాయణ, ముని వెంకటేశ్వర్లు బాధిత పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఈ విషయాన్ని వెంటనే మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ‘కంపెనీలు ఇచ్చే మాయమాటలు నమ్మి బాండ్లు లేకుండా ఒప్పందాలు చేసుకోవద్దు. నూజివీడు సీడ్స్ యాజమాన్యం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో బాధితుల తరపున ఉద్యమిస్తామన్నారు.


