బరి తెగింపు
చెరుకుపల్లి వద్ద 50 ఎకరాల్లో పెద్ద బరి
వేమూరు, కొల్లూరు మండలాల్లో రెండేసి బరులు
పిట్టలవానిపాలెం మండలంలో ఓ భారీ బరి
పర్చూరు, చీరాల ప్రాంతాల్లోనూ కోడి పందేల జోరు
సంప్రదాయ క్రీడ మాటున జూదం..
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో కోడిపందాల కోసం వచ్చే వీఐపీలకు సిద్ధమవుతున్న వేదిక
రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందేలు, పేకాట కోసం బరి సిద్ధం చేశారు. ఇందులో ఒకటి పెద్ద బరికాగా.. మిగిలిన పది బరులు చిన్నవి. పెద్ద బరిలో రూ.లక్ష నుంచి రెండు లక్షల పందేలు జరగనుండగా చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకు జరగనున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పేకాట నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వారికి ఐదు రోజులపాటు పేకాట ఆడుకునేందుకు రూ. 60 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. బరులవద్ద పార్కింగ్, మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సంక్రాంతి నాడు సంప్రదాయ క్రీడగా ఆడుకొనే కోడి పందేలను జూద క్రీడగా మార్చి కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు అధికారపార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇందుకోసం పండుగకు వారం ముందే బరులు సిద్ధం చేశారు. ఐదు రోజులపాటు పందాలు, పేకాట జోరుగా సాగనుంది. అంతకు మించి పై పందాలు ఉండనున్నాయి. వందల కోట్లలో వ్యాపారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. బరుల వద్ద పలురకాల వ్యాపారాలను లాభసాటిగా మార్చేందుకు టీడీపీ, జనసేన నేతలు సిద్ధమయ్యారు. కూల్‌డ్రింక్ షాపులు మొదలు చిరుతిళ్ల దుకాణాలు నెలకొల్పతున్నారు. బరులవద్ద అనధికార మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
వేమూరు నియోజకవర్గంలో..
ఈ ప్రాంతంలో ఐదు బరులు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు మండలం కేంద్రం మార్కెట్ సమీపంలో టీడీపీ నేత పది ఎకరాల్లో ఒక బరి సిద్ధం చేయగా..ఇదే మండలంలోని చావలి– కోడిపర్రు మధ్యన జనసేన నేత పది ఎకరాల్లో మరో బరి నెలకొల్పారు. కొల్లూరు మండలం కేంద్రం సమీపంలో క్రాప వద్ద ఒక బరి, ఇదే మండలంలోని అనంతవరం వద్ద మరొక బరిని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. చుండూరు మండలం వేటపాలెం వద్ద బరి సిద్ధం చేశారు.
బాపట్ల నియోజకవర్గంలో...
పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద టీడీపీ నేతలు బారీ బరి ఏర్పాటు చేశారు. ఈ బరులన్నింటిలో రూ.25 వేలు మొదలు రెండు లక్షల వరకు పందాలు సాగనున్నాయి. పెద్ద ఎత్తున పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గంజాంతోపాటు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాల్లో కోడి పందేలు జరగనున్నాయి. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో కోడిపందాలు, పేకాట నిర్వహించనున్నారు. జిల్లాలో జరిగే కోడిపందాలు, పేకాటలకు జిల్లా నలుమూల నుంచే కాక అటు ప్రకాశం, నెల్లూరు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
అక్కడే మద్యం దుకాణాల ఏర్పాటు
బరి తెగింపు


