నకిలీ ముఠా గుట్టు రట్టు
బాపట్లటౌన్ తక్కువ ధరకే బంగారం పేరిట మోసానికి పాల్పడిన నకిలీ ముఠా గుట్టును వెదుళ్లపల్లి పోలీసులు రట్టు చేశారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. స్టువార్టుపురం రెండో గ్యాంగ్‌కు చెందిన లక్ష్మి అలియాస్ పీరిగ కల్యాణి తన బావ అంగడి చంద్రబాబు, అక్క ప్రసన్నకుమారిలు ఆర్థిక లావాదేవిల కారణంగా బ్యాంకులో పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నారని, అది విడిపించుకుంటే చాలా లాభం వస్తుందని తనకు పరిచయం ఉన్న తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పందూరు గ్రామానికి చెందిన మొగిలిశెట్టి శ్రీదేవి అలియాస్ దేవిని నమ్మిచింది. లక్ష్మి మాటలు నమ్మిన శ్రీదేవి తన డ్రైవర్ విజయ్‌తో కలిసి ఈనెల 6న స్టువర్టుపురం గ్రామానికి చేరుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం లక్ష్మి వీరితో మాట్లాడుతుండగా అంగడి ప్రసన్నకుమారి అలియాస్ అమ్ములు, అంగడి చంద్రబాబు, చిన్నపోతుల భవానీశంకర్ అలియాస్ సన్నీ, మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పెద్దపప్పు, అంగవి కావేరి అలియాస దీప్తి, అంగడి లోహిత్ అలియాస్ దీపులు పోలీసు వేషాల్లో వచ్చి శ్రీదేవిని బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ.6.50 లక్షలు లాక్కొని పారిపోయారు. దీంతో బాధితురాలు వెదుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వెదుళ్లపల్లి ఎస్‌ఐ పి.భాగ్యరాజ్ తమ సిబ్బందితో దాడిచేసి ఈనెల 11న చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ తల్లి దేవాలయంలో నిందితులను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను అరెస్ట్‌చేశారు. నకిలీ ముఠా కేసును ఛేదించిన వెదుళ్లపల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్, రూరల్ సర్కిల్ సీఐ బి.హరికృష్ణలను ఎస్పీ అభినందించారు.


