వాయుగండాలతో గజగజ
న్యూస్‌రీల్
నిధులు మంజూరు కావాలి
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
చీరాల టౌన్: తుపాను పేరు వింటేనే తీర ప్రాంత గ్రామాల ప్రజల భయపడిపోతున్నారు. ఏడాదికి పది వరకు తుపానులు, వాయుగుండాలు ఏర్పడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజల భద్రత గురించి పాలకులు కూడా పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు, తుపాన్లు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లోతట్టు, బాధిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు వణికి పోతున్నారు. పలుచోట్ల తుపాను షెల్టర్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. అధికారులు వాటిని కూల్చి వేశారే కానీ నూతన షెల్టర్లు మాత్రం నిర్మించ లేదు.
పలుచోట్ల కూల్చివేత
గతంలో వరుసగా లైలా, ఓగ్ని, జల్, ధానే వంటి తుపాన్లు వచ్చినా అధికారులు కొత్త షెల్టర్ల నిర్మాణం గురించి పట్టించుకోలేదు. రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు వివిధ కళాశాలలు, పాఠశాలల్లో పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు భారీ వర్షాలతో పాటుగా తుపాన్లు, వాయుగుండాలు పడుతుంటాయి. రుతు పవనాల తాకిడి కూడా ఉంటుంది. గతంలో భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల్లోని నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తుపాను సెంటర్లు ఎంతో ఉపయోగ పడ్డాయి.
అయితే, దేవినూతల, తోటవారిపాలెం, పచ్చమొగిలి, విజయలక్ష్మీపురం, దేవాంగపురి, పిట్టువారిపాలెం, కీర్తివారిపాలెం గ్రామాల్లో షెల్టర్లు శిథిలావస్థకు చేరడంతో అధికారులు కూల్చివేశారు.
కళాశాలలు, హైస్కూళ్లలో పునరావాసం
మోంథా తుపాన్ సమయంలో వాడరేవులోని హైస్కూల్, మోడల్ స్కూల్, ఈపురుపాలెం, దేవాంగపురి హైస్కూళ్లను షెల్టర్లుగా వినియోగించారు. పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ హైస్కూళ్లను పునరావాసా కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. తుపాన్ల సమయంలో ప్రజలను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసే అధికారులు షెల్టర్లు నిర్మించడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు.
శిక్షణ కేంద్రంగా షెల్టర్
వాడరేవులో ప్రపంచ బ్యాంకు నిధులు రూ.1.5 కోట్లతో నిర్మించిన షెల్టర్‌ను డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శిక్షణలకు కేంద్రంగా మార్చుకున్నారు. దీంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుని, ఆశ్రమం కల్పించే బృహత్తర లక్ష్యం కాస్తా అటకెక్కింది.
గతంలో ఉన్న షెల్టర్లు శిథిలావస్థకు చేరడంతో కూల్చి వేశారు. ప్రస్తుతం నూతన నిర్మాణాలపై పంచాయతీల కార్యదర్శుల నుంచి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించా. రాగానే డీపీఓ ద్వారా జిల్లా కలెక్టర్‌కు నివేదికలు అందిస్తాం. ప్రభుత్వం అనుమతులు, నిధులు మంజూరు చేస్తే నిర్మాణాలు చేపడతాం.
– విజయ, చీరాల ఎంపీడీవో
వాయుగండాలతో గజగజ


