నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
వేటపాలెం: మోంథా తుపానుతో వరి పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని చీరాల నినియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ తెలిపారు. మండల పరిధిలోని పందిళ్లపల్లిలో మంగళవారం వరదలకు ముంపునకు గురైన పంట పొలాలను రైతులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం చేయూత నందించాలని కోరారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ– క్రాప్ నమోదు పేరుతో అర్హులైన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ– క్రాప్, అసైన్డ్ భూములు తదితర కారణాలతో కొంత మందికి నష్ట పరిహారం ఇవ్వకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారని రైతులు వెంకటేష్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంట నష్ట పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందించారని గుర్తు చేశారు. రైతుల పొట్ట కొట్టవద్దని హితవు పలికారు. రైతులకు న్యాయం జరగని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు సాదు రాఘవ, మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, పిన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, కావూరి రమణారెడ్డి, గుత్తి మల్లేశ్వరరావు, ఏ.శివారెడ్డి, రొండా శ్రీనివాసరెడ్డి, యారాజు ఉమ, చొప్పరపు సుబ్బారావు, కంచి సాంబిరెడ్డి, కీర్తి వెంకట్రావు, ఖాదర్, రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ చీరాల
ఇన్‌చార్జి కరణం వెంకటేష్


