
ప్రేక్షకులను అలరించిన నాటికలు
మార్టూరు: శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్టూరులో మూడు రోజులుగా నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒకచోట ప్రేక్షకులకు ఎదురవుతున్న సమస్యల తాలూకు ఇతివృత్తాలే కావడంతో ప్రేక్షకాదరణకు నోచుకోవడం విశేషం. చివరిరోజైన శనివారం రాత్రి ప్రదర్శించిన మూడు నాటికలు ఒకదానితో మరొకటి పోటీ పడటం విశేషం. నాటిక ప్రదర్శనలకు ముందు వేదిక స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తవ రపు సురేష్ బాబు, అరుణకుమారిలు రోటరీ శ్రీకారం పరిషత్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి నాటికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జె.వి.మోహనరావు, శ్రీకారం కార్యదర్శి జాష్టి అనురాధ, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దు మాల కోటేశ్వరరావు, మాదాల సాంబశివరావు పాల్గొన్నారు.
పరిమితులు లేని ‘స్వేచ్ఛ’ ప్రగతి నిరోధకం
సమాజంలోని ఇతరులకు భంగం కలిగించనంతవరకు స్వేచ్ఛ స్వాగతించదగినదే. అలా కాకుండా ఎవరికి వారు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తామంటూ యథేచ్ఛగా వ్యవహరించటం ప్రారంభిస్తే అది సమాజ హితం కాబోదని పరిమితులు కలిగిన స్వేచ్ఛతోనే మానవ మనుగడకు శ్రేయస్కరమని నాటికలోని నటీనటులు పాత్రోచితంగా నటించి చూపారు. ఎటు గాలి వీస్తే అటువైపు ఎగిరే గాలిపటం దారమనే పరిమితి వలన మాత్రమే ఆకాశంలో అందంగా ఎగురుతూ కనిపిస్తుందని గాలిపటానికి ఆధారమైన ‘ఆ దారము’ తెగిన నాడు ఏ చెట్టు కొ మ్మల్లోనో చిక్కుకుపోయి ఆగాలిపటం చిరిగిపోతుందని ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్వేచ్ఛ పేరిట నేటి తరం పాకులాడు తూ కుటుంబ వ్యవస్థల విచ్చిన్నానికి పాల్పడుతు న్న తీరును విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన స్వేచ్ఛ నాటికను పి. శివ రాం రచించగా బి.ఎం రెడ్డి దర్శకత్వం వహించారు.
వివాహ వ్యవస్థపై సంధించిన బాణం
వివాహ వ్యవస్థపై సంధించిన బాణం ‘విడాకులు కావాలి’ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని, అందుకు భార్యాభర్తల మధ్య ఉండవలసిన వైవాహిక దాంపత్యానికి మినహాయింపు ఏమీ లేదంటున్న నేటి యువతకు కనువిప్పు కలిగించేలా ప్రదర్శించిన ‘విడాకులు కావాలి’ నాటిక ప్రేక్షకులను రక్తి కట్టించింది. ఆర్థికపరమైన స్వేచ్ఛలు పెరుగుతూచిన్నచిన్న కారణాలతోనే భార్యాభర్తల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలతో విడాకుల కోసం కోర్టుల చుట్టూ పరిగెత్తుతూ తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న నేటి తల్లిదండ్రుల తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి నాటికను వల్లూరు శివప్రసాద్ రచించగా గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు.
‘బ్రహ్మ స్వరూపం‘తో బరువెక్కిన హృదయాలు
సమాజంలోని ప్రతి మనిషి ప్రారంభంలో మంచితనంతో నిస్వార్థంగా, ఆత్మీయ అనురాగాలతో జీవించాలని ఇతరులు కూడా తన పట్ల అలాగే ఉండాలని కోరుకుంటాడు. వాస్తవ ప్రపంచంలో అది సాధ్యం కాక పెరిగిపోతున్న స్వార్థంతో మనిషి జీవితంలోకి ఊహకందని కష్టాలు, నష్టాలు ప్రవేశిస్తాయి. మనిషి అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిన సందర్భాలలో ఆ మనిషి నిస్సహాయుడైన వేళ సాక్షాత్తు ఆ బ్రహ్మ స్వరూపమే ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించి ధర్మాన్ని గెలిపిస్తుందనే ఇతివృత్తంగా సాగిన నాటిక బ్రహ్మస్వరూపం.
మూడు రోజులపాటు సాగిన నాటికలు ముగిసిన పోటీలు

ప్రేక్షకులను అలరించిన నాటికలు