కావ్యేషు నాటకం రమ్యం
● మార్టూరు కళాపరిషత్తుకు 15 వసంతాలు ● గ్రామీణ ప్రాంత ప్రజల చైతన్యమే లక్ష్యంగా అవిశ్రాంత నిర్వహణ ● నేటి నుంచి మార్టూరులో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నాటికల పోటీలు
మార్టూరు: కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. అన్ని కళల్లో నాటకం ప్రాధాన్యతకు ఇది అద్దం పడుతుంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నాటక రంగం నేడు మిణుకు మిణుకుమంటోంది. సినీ, టీవీ మాధ్యమాలతో వెలవెలబోతోంది. ప్రజల ఆదరణ కూడా తగ్గింది. నాటక పరిషత్‌లు జవసత్వాలు కల్పిస్తున్నా, వాటి నిర్వహణ వ్యయ ప్రయాసలతో కూడుకుంది. ప్రదర్శనల వల్ల వ్యయమే తప్పా ఆదాయం రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్టూరుకు చెందిన శ్రీకారం రోటరీ కళాపరిషత్తు 15 సంవత్సరాలుగా నిరంతరంగా నాటక పోటీలు నిర్వహిస్తోంది. నటులను ప్రోత్సహించడంతో పాటు ఆలోచింపజేసే నాటికలతో జనరంజకంగా సాగుతోంది. ఏప్రిల్ 24, 25,26 తేదీల్లో మార్టూరు మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 15వ నాటికల పోటీలు నిర్వహిస్తోంది.
శ్రీకారం రోటరీ కళా పరిషత్ ఆవిర్భావం
ప్రపంచవ్యాప్తంగా సేవారంగంలో వ్యాపించి ఉన్న రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ మార్టూరు శాఖ ఇక్కడ కళారంగంలో అడుగుపెట్టడం విశేషం. స్థానికంగా ఉన్న శ్రీకారం స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి ఒకటిన్నర దశాబ్దాలుగా మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ పేరుతో పరిషత్తు నాటికల పోటీలు నిర్వహిస్తోంది. ఈ పరిషత్తు ద్వారా నటుల్ని, నాటికలను మాత్రమే ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు, క్రీడాకారులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను సన్మానిస్తోంది.
కళా పరిషత్తుకు అండగా జేవీ
మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన జాష్టి వెంకట మోహన్‌రావు (జె.వి) ఆయన భార్య అనూరాధ దంపతులు మార్టూరు కేంద్రంగా స్థాపించిన ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ మూడు దశాబ్దాలుగా నడుస్తోంది. ప్రజలకు ముఖ్యంగా రైతులకు నిర్మాణాత్మక సేవలు అందిస్తోంది. రైతులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని రంగాలకు ఉపయోగపడాలనే జేవీ ఆశయం నుంచి ఆవిర్భవించిందే ఈ కళాపరిషత్తు. విశ్రాంత అధ్యాపకులు, నటుడు, రచయిత, దర్శకుడు అయిన మండలంలోని కోలలపూడి గ్రామానికి చెందిన కందిమళ్ల సాంబశివరావు, జాష్టి అనూరాధ అధ్యక్ష, కార్యదర్శులుగా 15 సంవత్సరాల కిందట మార్టూరు రోటరీ క్లబ్‌తో కలిసి శ్రీకారం రోటరీ కళాపరిషత్‌ను స్థాపించారు.
నిర్వహణ కోసం శాశ్వత నిధి
నాటకాలు సామాజిక స్పృహను కల్పించడంతో కీలకపాత్ర పోషిస్తాయని నమ్మిన జేవీ భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఈ కళాపరిషత్ నిరాటంకంగా కొనసాగేందుకు గాను 2018లో శాశ్వత నిధిని ఏర్పాటు చేయడం విశేషం.
నాటికలతో సాంత్వన
రోజురోజుకూ యాంత్రికత పెరిగిపోతున్న మనిషి జీవితంలో ఆటవిడుపునకు నాటకాలు ఎంతో దోహదపడతాయి. ఒత్తిడిని మరిచిపోయి, జీవితంలో ఏమి కోల్పోతున్నామో తెలుసుకోగలుగుతాం. ఏటా ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో పరిషత్ ఆధ్వర్యంలో నాటికల ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువలో పరిషత్తు నిర్వహణ గర్వించదగ్గ విషయం.
–శానంపూడి లక్ష్మయ్య,
మార్టూరు రోటరీ క్లబ్ సభ్యులు
సామాజిక సమస్యల పరిష్కార వేదిక నాటక రంగం
సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపి వాటి పరిష్కారాలను కళ్లకు కట్టినట్లు చూపగలిగేది నాటిక మాత్రమే. మా పరిషత్తు ద్వారా సమాజంలోని కొంతమందిలోనైనా మార్పు తీసుకురాగలిగితే మా ప్రయత్నం సఫలమైనట్లే. రోటరీ క్లబ్‌తో కలిసి ప్రయాణం చేయడం, స్థానికులు, దాతల ప్రోత్సాహంతో పరిషత్తును విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తాం.
–జె. వి.మోహనరావు, డైరెక్టర్,
ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ
కావ్యేషు నాటకం రమ్యం


