ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచండి
యద్దనపూడి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తమం తెలిపారు. ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం మండలంలోని పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఆరవ తరగతిలో 28 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరవ తరగతిలో చేర్పించేలా హెచ్‌ఎంలతో పాటు ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యాశాఖాధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నిష్టాతులైన ఉపాధ్యాయుల శిక్షణలో చిన్నారుల బంగారు భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దుతామనే నమ్మకాన్ని తల్లిదండ్రులకు కలిగించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న రుచికరమైన మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాం, పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, షూ తదితర మౌలిక వసతుల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డి. గంగాధర్, ఎంఈఓ –2 చిలుకూరి గోపి, ప్రధానోపాధ్యాయుడు ఏఎం . శ్రీనివాసరావు ,హెచ్‌ఎం రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ బోయపాటి సాంబశివరావు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తమం


