కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గంగమ్మతల్లి
కారంచేడు: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కారంచేడు గంగమ్మ తల్లి శిడి మహోత్సవం ఈనెల 27వ తేదీ ఆదివారం వైభవంగా జరగనుంది. గ్రామంలోని పుట్టాయిపాలెంలో పెద్ద ఎత్తున జరిగే గంగమ్మ తల్లి తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది. 38 ఏళ్లుగా ప్రతి ఏడాదీ అమ్మవారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపం కలిగి, భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉండే గంగమ్మ అమ్మవారి గుడి అంటే సమీప ప్రాంతంలో మంచి ప్రసిద్ధి. తొలుత స్థానిక గ్రామస్తులు చిన్న గుడిని ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించగా ప్రస్తుతం ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెందింది. దేవాలయం అభివృద్ధిలో దేవస్థాన కమిటీ, సభ్యులు విశేష కృషి చేశారు. ప్రతివారంలో మంగళ, ఆదివారాల్లో భక్తులు విరివిరిగా వచ్చి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న భక్తుల కష్టాలు, కోర్కెలను తీర్చే తల్లిగా పోలేరమ్మ తల్లికి పేరుంది. అందుకే ప్రతి ఏడాదీ అమ్మవారి తిరునాళ్ల, శిడి మహోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. తిరునాళ్ల రోజు శిడి పెళ్లి కొడుకుతో ఊరేగింపుగా అమ్మవారి గుడికి వెళ్లి గుడి వద్ద ఉండే శిడి మానుకు ఒక పెట్టెలో మేకపోతును ఉంచి, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో శిడిమాను పైభాగంలో చెక్కపెట్టెలో ఉంచిన మేకపోతును భక్తులు జీడికాయలతో కొడుతుంటారు. శిడిమాను లాగితే కష్టాలు తొలిగిపోతాయని భావించే భక్తులు శిడిమాను బండిని లాగేందుకు పోటీ పడతారు. తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్ ప్రభలు ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ప్రభలతోపాటు నాటికలు, కళాకారులతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పా టు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని పశుసంపదతోపాటు వాహనాలను గుడి చుట్టూ తిప్పి ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ తిరునాళ్లకు గ్రామ ఆడపడుచులు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. తమ ఇంటి ఇలవేల్పుకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పండుగకు బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుండే కాకుండా మండలంలోని అన్ని గ్రామాలతోపాటు పరిసర గ్రామాల నుంచి తిరునాళ్లను చూసేందుకు ప్రజలు వేల సంఖ్యలో వస్తుంటారు.
భారీ బందోబస్తు
తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల డీఎస్పీ ఆధ్వర్యంలో ఇంకొల్లు సీఐ, కారంచేడు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.
నేటి నుంచి ఐదు రోజుల ప్రత్యేక పూజలు
బుధవారం పోలేరమ్మ, గంగాభవానీ అమ్మవార్లకు తలంట్లు, నైవేద్యాల సమర్పణ, సాయంత్రం పావనం బొల్లావుల ఊరేగింపు, 24వ తేదీన రాజు, ప్రధాని బియ్యం కోల, బద్దె గొర్రె, 25వ తేదీన పాలవెల్లి, కథా కాలక్షేపం, 26వ తేదీన ఆగుమంచి బోనాలు, ఆడపడుచుల జమ్మి పొంగళ్లు, సాయంత్రం పాలేరు దగ్గర గంగా, కాటమరాజుల తర్కవాదాలు, 27వ తేదీ ఉదయం గ్రామంలోని పశువులు, నూతన వాహనాలు ప్రత్యేక అలంకరణలో గుడిచుట్టూ ప్రదక్షిణలు, సాయంత్రం శిడి పెళ్లికుమారుడి ఊరేగింపు, శిడిమాను మహోత్సవం, విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 28న అమ్మవారి పొంగళ్లతో తిరునాళ్ల ముగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
నేటి నుంచి ఐదు రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు
27న శిడిమహోత్సవం, తిరునాళ్లు
కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గంగమ్మతల్లి


