ఉర్దూ పోస్టులు తొలగించడం దారుణం
మార్టూరు: దశాబ్దాలుగా ముస్లిం జనావాసాల మధ్య ఉన్న ప్రాథమిక పాఠశాలలోని ఉర్దూ పోస్టును తొలగించటం తగదని, పోస్టు కొనసాగించాలంటూ ద్రోణాదుల గ్రామ ముస్లింలు శనివారం మండల విద్యాశాఖ అధికారి ఎంసీహెచ్ వస్రం నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ద్రోణాదుల ముస్లిం కాలనీలో ఉన్న ఎంపీపీఎస్(పీఎస్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని దశాబ్దాలుగా ఉర్దూ సబ్జెక్టుకు సంబంధించిన పోస్ట్ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల ప్రభుత్వం అవలంభిస్తున్న నూతన విధానాలలో భాగంగా ఆ పాఠశాలలోని ఉర్దూ పోస్టును తొలగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ద్వితీయ అధికార భాషగా ఉన్న ఉర్దూ పోస్టులు ఇప్పటివరకు మండలంలో 11 ఉండగా వాటిలో నాలుగు పోస్టులను తొలగించి ఏడుగురు టీచర్లను మాత్రమే కొనసాగించటం దారుణమని వారు పేర్కొన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నందువలన గత రెండు దశాబ్దాలుగా ఇప్పుడిప్పుడే ముస్లింలు తమ పిల్లలను చదివిస్తూ ఉన్నత స్థానాలకు పంపగలుగుతున్నారని ఈ క్రమంలో ఉర్దూ పోస్టులు రద్దు చేయడం ద్వారా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎంఈఓ ఎంసీహెచ్ వస్రం నాయక్కు తమ కాలనీ పరిధిలోని పాఠశాలలో ఉర్దూ పోస్టును కొనసాగించాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో ద్రోణాదుల ముస్లిం కాలనీ వాసులు పఠాన్ బాషా, షేక్ మస్తాన్, పెద్ద మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు
మార్కాపురం టౌన్: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్‌వీకేపీ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు 2వ రోజైన శనివారం ఉత్సాహంగా సాగాయి. పోటీలకు గుంటూరు, నంద్యాల, బాపట్ల, తెలంగాణలోని సూర్యాపేట, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం పోటీల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన జీఎల్‌ఆర్ గ్రూప్స్, గరికపాటి లక్ష్మయ్యచౌదరిలకు చెందిన ఎడ్ల జత 4351.06 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బీ కేశవరెడ్డికి చెందిన ఎడ్ల జత 4325.09 అడుగుల దూరంలాగి రెండో స్థానాన్ని, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చుండూరుకు చెందిన ఆర్‌కె బుల్స్, శిరీషా చౌదరికి చెందిన ఎడ్ల జత 4291.10 అడుగులు లాగి మూడో బహుమతిని, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన జే సహస్రయాదవ్, జేవీఎల్ యాదవ్‌కు చెందిన ఎడ్ల జత 3881.10 అడుగులు లాగి 4వ స్థానాన్ని సాధించాయి.
విద్యతోపాటు మహిళల అభివృద్ధిలో భాగస్వామి
పిడుగురాళ్ల: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యతోపాటు మహిళల అభివృద్ధికి కూడా భాగస్వామి అవుతుందని సీఎస్‌ఆర్ డైరెక్టర్ బి.బబిత అన్నారు. పట్టణ శివారులోని కొండమోడులో ఏర్పాటు చేసిన ఉచిత జూట్ ఉత్పత్తుల తయారీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ధ్రువీకరణ పత్రాలను అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణను వదిలేయకుండా మహిళలు స్వయం ఉపాధికి ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ నెల రోజుల శిక్షణ తరగతులు 15 రకాల ఉత్పత్తులను శిక్షణ ద్వారా తయారు చేయటం నేర్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మండూరు వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గా, పీఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్లు కె.నరసింహారావు, బాడిస మస్తాన్ పాల్గొన్నారు.
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న కంటైనర్
తమిళనాడుకు చెందిన డ్రైవర్‌కు తీవ్రగాయాలు
యడ్లపాడు: హైవే సెంట్రల్ డివైడర్‌పై మొక్కలకు నీరు పొస్తున్న వాటర్ ట్యాంకర్‌ను కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు చెందిన కంటైనర్ గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న క్రమంలో యడ్లపాడు మండలం బోయపాలెంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో హైవేపై మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కార్మికుల పోరాటాన్ని పట్టించుకోకపోవడం దారుణం
నరసరావుపేట: ఆప్కాస్‌లో ఉన్న తమకు పనిచేసిన రోజులు అన్నింటికి జీతం చెల్లించాలని కోరుతూ 30 రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధనకోసం కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలు శనివారంతో 31వ రోజుకు చేరాయి. శిబిరాన్ని కృష్ణ సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలియచేసి మాట్లాడారు. ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో అర్ధంకావట్లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తామని ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన కూటమి నాయకులు తమకు నెలజీతం ఇప్పించమని కోరుతున్న కార్మికులవైపు చూడకపోవటం వారి నైజం తెలియచేస్తుందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి తమ సంఘం పూర్తిగా మద్దతు తెలియచేస్తుందన్నారు. వెంటనే అధికారులు కలుగుచేసుకొని వారికి పూర్తిజీతంతో పాటు విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
ఉర్దూ పోస్టులు తొలగించడం దారుణం
ఉర్దూ పోస్టులు తొలగించడం దారుణం
ఉర్దూ పోస్టులు తొలగించడం దారుణం


