బీమా.. ఏదీ ధీమా?
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వేటపాలెం: సంక్షేమ పథకాల అమలును కూటమి సర్కారు గాలి కొదిలేసింది. కనీసం బీమా పథకమైనా అమలు చేస్తే కాస్త భరోసా ఉంటుందని పేద ప్రజలు భావించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్ బీమాను అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదోడికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహాయం అందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా బాధితుల వద్దకే వెళ్లి సీఎం సహాయ నిధి పరిహారం అందించారు. సవ్యంగా సాగుతున్న ఈ పథకం సార్వత్రిక ఎన్నికల తర్వాత కుంటుపడింది. పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చి అమలును మాత్రం వదిలేశారు. దీంతో సహజ మరణంతోపాటు ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలు పది నెలలుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నాయి. అసలు బీమా పథకం ఇస్తారా? ఎత్తేస్తారా? అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 4,70,200 రేషన్ తెల్లకార్డులు ఉన్నాయి. వీకంతా దారిద్య్రరేఖకు దిగువగా ఉన్నవారు. చీరాల నియోజకర్గం పరిధిలోని చీరాల టౌన్, రూరల్, వేటపాలెం మండలాల పరిధిలో 57,010 మంది తెల్లరేషన్ కార్డులు దారులు ఉన్నారు. ఏఏవై, తెల్ల రేషన్ కార్టులు కలిగిన వారంతా బీమా పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తూ ఏదో ఒక రూపంగా మృత్యువు నిత్యం కబళిస్తూనే ఉంది. అయితే ఆదుకోవాల్సిన బీమా పథకం అమలు చేస్తారో? లేదో తెలియడం లేదు.
రూ.10 లక్షలు మాటేంది...
బీమా పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అర్హులందరీకి న్యాయం చేస్తాం. వైఎస్సార్ సీపీ హయాంలో కంటే రెట్టింపు సాయం అందిస్తాం.. సహజ మరణానికై తే రూ.5 లక్షలు, ప్రమావశాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికలప్పుడు ఊరూరా ఊదర గొట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ముంద్రించి ఇంటింటా పంపిణీ చేశారు. అధికారం చేపట్టాక వక్ర బుద్ధి చూపుతున్నారు. 2024 మే 13 నుంచి బీమా పథకం వివరాలు వెబ్‌సైట్ నుంచి తొలగించారు. తర్వాత నమోదుకు అవకాశం కల్పించలేదు. అప్పటి నుంచి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలై సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వేచి చూడాల్సి వస్తోంది.
న్యూస్‌రీల్
2024 మార్చి తర్వాత
అమల్లోకి రాని పథకం
13 నెలలుగా ఎదురు
చూపులకే పరిమితం
ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్భాట ప్రకటన
అధికారం చేపట్టి పది నెలలైనా
అతీగతీలేదు
బీమా ఉంటే కుటుంబాన్ని ఆదుకునేది
నేను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నాను. ఎదిగి వచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించాం. ఆరు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కుమారుడు మృతి చెందాడు. అదే బీమా పథకం ఉంటే రూ.10 లక్షలు సాయం అందేది. ఇప్పటికై నా రూ.10 లక్షలు పరిహారం అందించి ఆదుకోవాలి
–లక్ష్మి, వేటపాలెం:
మార్గదర్శకాలు రావాలి
ప్రభుత్వం నుంచి బీమా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడలేదు. సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ ఆన్‌లో లేదు. మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తాం.
–అంజిబాబు, ఏపీఎం, వేటపాలెం:
బీమా.. ఏదీ ధీమా?


