పరిశ్రమల స్థాపనకు అన్ని వనరులు సమకూర్చాలి
బాపట్ల: పరిశ్రమల స్థాపనకు అన్ని వనరులు, అనుమతులు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలతో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. అవసరమైన వనరులు సమకూర్చడం, అనుమతులకు సహకరించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పలు సూచనలు చేశా రు. పరిశ్రమల స్థాపనకు ఇటీవల సింగిల్ డెస్క్ విధానంలో 189 దరఖాస్తులురాగా, అందులో 171 అనుమతులు పొందాయన్నారు. పీఎంఈజీపీ పథకం కింద 56 యూనిట్లు స్థాపించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రూ.1.53 కోట్ల నిధులతో యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా 65 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకానికి జిల్లా నుంచి 38,446 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి అందులో 4,765 దరఖాస్తులను కేంద్రానికి పంపామన్నారు. 2,916 దరఖాస్తులకు అనుమతులు లభించాయన్నారు. సమావేశంలో డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, కమిటీ కన్వీనర్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వై రామకృష్ణ, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఫ్యాప్సా కార్యదర్శి భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.
సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలి
జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ చేపట్టా లని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, పరిశ్రమలకు భూసేకరణ, ఇసుక రవాణా, స్వచ్ఛ ఆంధ్ర, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం చీరాల, రేపల్లె డివిజన్లలో భూసేకరణ చేపట్టాలన్నారు. రుతు పవనాలు రాకముందు ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తుగా లక్ష టన్నుల ఇసుకను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం గాజులంక –1 ఇసుక రీచ్ నుండి ఇసుక సరఫరా జరుగుతుందన్నారు. గాజులంక –2 ఇసుక రీచ్ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా కృష్ణా పశ్చిమ కాలువల ద్వారా ట్యాంకులకు నీరు నింపుకోవాలని ఆదేశించారు. బాపట్ల పట్టణానికి తాగునీరు అందించే రక్షిత నీటి పథకానికి కృష్ణ పశ్చిమ కాలువ ద్వారా నీటిని నింపుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మూడుసార్లు ఫిర్యాదులు వచ్చిన సిబ్బందిని పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్, జిల్లా సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర నాయుడు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి


