కన్నేశాడు...కబ్జా చేశాడు
టాస్క్‌ఫోర్స్: కుక్క పిల్ల..సబ్బు బిళ్ల..అగ్గి పుల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఏ రకమైన భూమైనా ఆక్రమణకు అర్హమై అంటున్నారు కూటమి నేతలు. ఈ నేపథ్యంలో వారి చూపు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంపై పడింది. అంతే అప్పటికప్పుడు దొంగ సర్వే నంబర్లు వేసి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా అమ్మకానికి పెట్టారు. భూమి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని స్థానికుల అంచనా. రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణదారుడికి అండగా నిలిచారు. ఆక్రమణదారుడు అధికార పార్టీ నేత కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
110 ఏళ్ల నాటి పూరాతన స్కూల్
వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని కొత్తనగర్‌లో చీరాల–ఒంగోలు ప్రధాన రహదారి పక్కన నాలుగు సెంట్ల స్థలంలోని ఓ పెంకుటింటిలో స్కూల్ నిర్వహించే వారు. 1985 ఫిబ్రవరి 24న అప్పటి సమితి అధ్యక్షుడు ఉప్పల వెంకటేశ్వర్లు పెంకుటిల్లును తొలగించి నూతనంగా పక్కా భవనం నిర్మించారు. కొంతకాలం తరువాత స్కూల్‌కి వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధాన రహదారి పక్కనే స్కూల్ భవనం ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. దీన్ని గమనించిన అప్పటి ప్రభుత్వం పాఠశాలను వేరే ప్రాంతంలో కొత్తగా భవనాలు నిర్మించి అక్కడికి తరలించారు. అప్పటి నుండి పాత స్కూల్ భవనం ఖాళీగా ఉండేది. కొంత కాలం ఈ స్కూల్ భవనాన్ని కమ్యూనిటీ హాలుగా గ్రామస్తులు వినియోగించుకున్నారు. ఆ తరువాత పశువైద్యశాలకు వినియోగిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ స్కూల్ భవనంలోనే కొంత భాగంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.
స్థలంపై కూటమి నేత కన్ను
లక్షలు విలువ చేసే స్కూల్ భవనం ముందు ఉన్న ఖాళీ స్థలంపై పందిళ్లపల్లికి చెందిన కూటమి చోటా నాయకుడి కన్ను పడింది. వెంటనే కబ్జాకు పథకం రచించాడు. అతనికి రామన్నపేట కొత్తనగర్‌లో సర్వే నెంబర్ 347–1లో అసైడ్ భూమికి పట్టా ఉంది. అప్పట్లో ఈ అసైన్డ్ భూమిని స్థానికులు ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారు. వేటపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 344–2లో 60 సెంట్ల భూమి ఉంది, దానికి కొలతలు కొలిపించాలంటూ జనవరి 6వ తేదీన తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ దాఖలు చేశాడు. జనవరి 24న సర్వేయరు ఆ భూమిని సర్వే చేశాడు. సర్వే సమయంలో సర్వేయరుకు వాల్యుం 87–1941లో రిజిస్టేషన్ డాక్యుమెంట్‌లు అర్జీదారుడు చూపించాడు. అతను చూపించిన డాక్యుమెంట్‌లోని అసైన్డ్ భూమి వేటపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 347–1లో ఉందని, అర్జీదారుడు కొలతల కోసం చూపించిన భూమి మాత్రం సర్వే నెంబరు 344–2లో ఉందని అర్జీదారుడికి సర్వేయరు ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. దీన్ని అడ్డు పెట్టుకొని 344–2లోగల పాత స్కూల్‌కి చెందిన ఒకటిన్న సెంట్ల భూమిని ఇంకొల్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మార్చి 24వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
రామన్నపేటలో ప్రభుత్వ స్కూల్ భూమి ఆక్రమణ దొంగ సర్వే నెంబర్‌తో రిజిస్ట్రేషన్ భూమి విలువ రూ.20 లక్షలు ఆక్రమణదారుడికి సహకరించిన రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు అటు వైపు కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు
సర్వే నంబర్లు వేరని ఎండార్స్‌మెంట్ ఇచ్చాం
పందిళ్లపల్లికి చెందిన వారు రామన్నపేట పాత స్కూలు ముందు స్థలం తమదని, దాన్ని సర్వే చేయాలని అర్జీ పెట్టారు. సర్వే సమయంలో వారు చూపిన డాక్యుమెంట్‌లు పరిశీలించాం. వారు కోరిన సర్వే నంబరు, వారు అర్జీలో రాసిన సర్వే నంబరు వేరుగా ఉన్నట్లు గుర్తించాం. అర్జీదారుడికి రెండు సర్వే నంబర్లు వేరని ఎండార్స్‌మెంట్ ఇచ్చాం.
–శ్రీనివాసరావు, మండల సర్వేయర్
కన్నేశాడు...కబ్జా చేశాడు
కన్నేశాడు...కబ్జా చేశాడు


