చీరాల: తైక్వాండోలో చీరాల క్రీడాకారుల ప్రతిభ చాటారు. ఆదివారం తెనాలిలోని ఎన్టీఆర్ స్టేడియంలో అస్మిత కేలో ఇండియా ఉమెన్స్ లీగ్ జూనియర్, సీనియర్ తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చీరాల క్రీడాకారులు విశేష ప్రతిభ చూపి పతకాలు సాధించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పతకాలు సాధించిన 13 మంది తైక్వాండో క్రీడాకారులను మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ అభినందించి సత్కరించారు. తైక్వాండో పోటీల్లో పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొనగా చీరాల నుంచి పోటీల్లో పాల్గొన్న 20 మందిలో 13 మంది క్రీడాకారులు పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. తైక్వాండో పోటీల్లో పాల్గొనడం వలన ఆత్మరక్షణతో పాటుగా శారీరక దృఢత్వం, ఏకాగ్రత, స్నేహ బంధాలు పెరగడంతో పాటుగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు పొందుతారన్నారు. జూన్‌లో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు చక్కని ప్రతిభ చూపి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మంచి శిక్షణ అందించిన కోచ్‌లు సలావుద్దీన్, వెంకటప్రసాద్‌లను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.