నేడు అట్ల తదియ
భట్టిప్రోలు: ఇస్తినమ్మా వాయినం – పుచ్చుకుంటున్నమ్మా వాయినం అంటూ మహిళలు వేడుకగా జరుపుకునే పండుగ అట్లతద్దె. ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ పండుగ సందర్భంగా గౌరీ పూజను, వ్రతాలు చేస్తారు. తదియ తిధినే తద్దిగా పిలుస్తారు. అట్లతద్దెను పల్లెల్లో ఊయల పండుగని, గోరింటాకు పండుగని అంటారు. ముఖ్యంగా కన్యలు, ముత్తయిదువులు వేడుకగా జరుపుకుంటారు. కొత్తగా పెళ్లయిన ఆడ పిల్లల ఇళ్లల్లో మరింత వేడుకగా జరుపుకుంటుంటారు. వేడుక ముందు రోజు మహిళల చేతులకు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. పండుగ రోజు 5, 9, 11 అట్లతో కూడిన వాయినాలు ఇవ్వడం ఆనవాయి తీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది. అట్లతద్ది నాడు తెల్లవారు జామున లేచి అన్నం, గోంగుర పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు. ‘‘అట్ల తద్దోయ్,... ఆరట్లోయ్... ముద్ద పప్పు.. మూడట్లోయ్’’ అంటూ ఇరు గు పొరుగు, స్నేహితులతో కలసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇది అదను కాబట్టి పిలల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు. గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని, పెళ్ళి ఈడుకు వచ్చిన యువతులను అమ్మమ్మ, నాయనమ్మలు ఆటపట్టిస్తుంటారు. ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకు ప్రస్తుతం లభించకపోవడంతో నేటి యువతులు మార్కెట్లో దొరికే కోన్‌లతో చేతులను అలంకరించుకుంటున్నారు.
తదియ రోజు గౌరీపూజ ముగిశాక ఊయల వేదిక ఘనంగా నిర్వహిస్తారు. ఉపవాసం ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా ఊయల ఊగుతారు. ఇందు కోసం పల్లెల్లో పెద్ద చెట్లకు ఉయ్యాలలు వేస్తారు. పొద్దు పోయే వరకు మహిళలు పోటీలు పడి ఉత్సాహంగా ఊయల ఊగుతుంటారు.
సిద్ధమవుతున్న పల్లెసీమలు ఊయల కట్టి.. వాయినాలిచ్చి...


