
భూ యాజమాన్య హక్కు చట్టంతో మేలు
చీరాల రూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న భూ యాజమాన్య హక్కు చట్టం అమలైతే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీనియర్స్ సిటిజన్స్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ అధ్యక్షతన ఏపీ భూ హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆధిక సంఖ్యలో ఈ చట్టానికి సానుకూలత వ్యక్తమవ్వగా.. ఒకరిద్దరు రాజకీయ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూములకు సంబంధించిన వ్యవహారం ఎంతో గజిబిజిగా ఉందని, ఒకే భూమిని అనేక మంది తమదంటే తమదని పోటీలు పడుతున్నారని చెప్పారు. మరికొందరైతే ఆ భూములకు హక్కుదారులమంటూ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుంటున్నారని, తద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులు చివరకు మోసపోతున్నారని చెప్పారు.
నిజమైన లబ్ధిదారుడి గుర్తింపే ల్యాండ్ టైటిలింగ్..
ప్రస్తుతం భూములు అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయని, ఆయా భూములన్నింటిని ఏకం చేసి నిజమైన లబ్ధిదారుడికి భూమిని అందించేందుకు ఏర్పాటు చేసేదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వక్తలు పేర్కొన్నారు. వందేళ్ల క్రితం బ్రిటీష్ హయాంలో భూములకు సంబంధించిన నియమాలు ఇప్పటికీ అలాగే నడుస్తున్నాయని, వాటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భూముల విషయంలో కోర్టుల్లో జరుగుతున్న కేసులు లక్షల్లో పెండింగులో ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ దస్తావేజులు రిజిస్ట్రార్ ఇవ్వడం లేదనే మాట అవాస్తవమని.. ఒరిజినల్ దస్తావేజులు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంబంధిత యజమానికి రిజిస్ట్రార్ అందజేస్తున్నారని స్పష్టం చేశారు. కొందరు ఈ విషయాలను తప్పుగా ప్రజలకు ప్రచారం చేస్తున్నారని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టాన్ని అమలుచేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసి కచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయని కొందరు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మాచర్ల మోహనరావు, విశ్రాంత తహసీల్దారు కోటేశ్వరరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, రిటైర్డు ఏసీపీ కట్టా రాజ్ వినయ్ కుమార్, మేడ వెంకటరావు, గాదె హరిహరరావు, వసంతరావు, గజవల్లి శ్రీనివాసరావు, గూడూరి శివరామ్ ప్రసాద్, ఎల్లమందారెడ్డి, సూర్యప్రకాశరావు, జయరామిరెడ్డి, రామేశ్వర కుమార్, మణిబాబు, రామ్‌మనోహర్ లోహియ, న్యాయవాది అంబటి పుష్పరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ భూ హక్కు చట్టంపై అవగాహన సదస్సు
అభిప్రాయాలు వ్యక్తం చేసిన పలువురు వక్తలు