
కొల్లిపర వంతెన
రూ.4.19 కోట్లతో నిర్మాణానికి జీఓ జారీ
కొల్లిపర(తెనాలి): కొల్లిపరలో కొలుపుల రోజున ప్రభుత్వం తీపి కబురు అందించింది. లంక గ్రామాల నుంచి, విజయవాడ–రేపల్లె వైపు నుంచి కరకట్ట మీదుగా కొల్లిపరకు రాకపోకలకు అతిప్రధానమైన పురాతన వంతెన స్థానంలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి జీఓ జారీచేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు, వాటిని అనుసంధానం చేసే వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవపల్‌మెంట్ (ప్రోగ్రెస్.1) ద్వారా 788 జీఓను జారీచేసింది. ఇందులో కొల్లిపరలోని వంతెన నిర్మాణానికి రూ.4.19 కోట్లను కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేయటం విశేషం. రేపల్లె బ్యాంక్ కెనాల్‌పై 32.75వ కిలోమీటరు వద్ద దీనిని నిర్మిస్తారు.
దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చిన్నవంతెన శిథిలావస్థకు చేరుకున్న విషయం తెలిసిందే. విజయవాడ–రేపల్లె కరకట్ట మార్గంలో రాకపోకలు చేయాలన్నా, కృష్ణాతీరంలో సాగుచేసిన పంటల రవాణాకు ఈ వంతెన ఎంతో కీలకం. దీని ఆవశ్యకతను గుర్తించిన గ్రామానికి చెందిన ప్రముఖుడు బొంతు గురవారెడ్డి కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మోన ఆరోక్యరాజ్‌కు వివరించి, కొత్త వంతెన నిర్మాణానికి అనుమతుల మంజూరు కోసం కృషిచేశారు. ఎంతోమంది సహకారం కూడా తీసుకున్నారు. అన్ని అవరోధాలు దాటుకుని రూ.4.19 కోట్లతో అనుమతులు మంజూరుచేస్తూ జీవో రావటంపై బొంతు గురవారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మన ఊరు మన బాధ్యతగా కొల్లిపర వంతెన నిర్మాణానికి తన వంతు సహకారం అందించానని చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తారని వివరించారు. కొన్ని దశాబ్దాలుగా కొల్లిపర వంతెనను నిర్మాణాన్ని సాకారమయ్యేలా కృషిచేసిన గురవారెడ్డికి రైల్వే సంప్రదింపుల కమిటీ సభ్యుడు ప్రశాంత్‌రెడ్డి గ్రామప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

బొంతు గురవారెడ్డి