సమస్యల పరిష్కార వేదిక స్పందన..

Spandana One Stop Public Grievance Redressal Platform For The Citizens - Sakshi

ఎలాంటి సమస్యకైనా నిర్దేశిత గడువులోగా పరిష్కారం..లేకుంటే సంబంధిత అధికారులదే బాధ్యత

స్పందనలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ ద్వారా అర్జీలు ఇవ్వవచ్చు

పలు మార్గాల్లో అర్జీల సమర్పణకు అవకాశం..

కర్నూలు(సెంట్రల్‌) : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకొంటోంది. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం రాకపోయినా, నిర్దేశించిన గడువులోగా ఇవ్వకపోయినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందనలో అర్జీలు తప్పక దానికి సమాధానం చేయాల్సి ఉంటుంది. 2019 జూన్‌ 1 నుంచి 2021 అక్టోబర్‌ 03వ తేదీ నాటికీ స్పందనకు రాష్ట్ర వ్యాప్తంగా 3,27,8,844 అర్జీలు రాగా, అందులో 3,20,9,919 అర్జీలకు పరిష్కారం చూపారు. 68,325 అర్జీల పరిష్కార మార్గాలు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందన అర్జీలను ఎన్ని మార్గాల ద్వారా ఇవ్వచ్చో చుద్దాం. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్, స్పందన మొబైల్‌ యాప్, వెబ్‌ అప్లికేషన్, ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లలో కలెక్టర్లకు అర్జీలు ఇవ్వవచ్చు. 

గ్రామ, వార్డు సచివాలయాలు..
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరిస్తారు. అక్కడ డిజిటల్‌ అసిస్టెంట్‌కు అర్జీలు ఇస్తే వాటిని స్పందన లాగిన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. తద్వారా మనం ఉన్న ప్రాంతం నుంచే అర్జీలు ఇచ్చేందుకు వీలు అవుతుంది. 

1902 కాల్‌ సెంటర్‌..
ఈ కాల్‌ సెంటర్‌ కూడా స్పందనకు సంబంధించిందే. ఇది 24 గంటలు పనిచేస్తుంది. 1902 కాల్‌ ఉచితంగా ఫోన్‌ చేసి మాట్లాడి మన సమస్యను అధికారికి తెలపాలి. దీనికి ఫోన్‌ చేసే సమయంలో ఆధార్‌నంబర్‌ కచ్చితంగా ఉండాలి. ఈ కాల్‌ సెంటర్‌కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏపీలోని మన సమస్యలకు పరిష్కారం కొనుగోనవచ్చు.

మొబైల్‌ యాప్, వెబ్‌ అప్లికేషన్‌...
ఈ రెండింటికి ఆన్‌లైన్‌ ద్వారా అర్జీలు ఇవ్వవచ్చు. మొబైల్‌యాప్, వెబ్‌ అప్లికేషన్లను మన సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని మన పూర్తి వివరాలను నమోదు చేసి పంపవచ్చు. 

కలెక్టరేట్‌లలో నేరుగా ఇవ్వచ్చు...
స్పందనకు ఎక్కువ సంఖ్యలో అర్జీలు వచ్చే మార్గం కలెక్టరేట్‌లలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌. ఇక్కడ సమస్యను ఏ అధికారి అయితే పరిష్కరించగలుగుతాడో నేరుగా అతనికే మన అర్జీని ఇస్తే అక్కడిక్కడే చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఇక్కడ కలెక్టర్, జేసీలు, జిల్లా ఉన్నతాధికారులు ఉండి అర్జీలు స్వీకరిస్తారు.  ఇక్కడే ఇచ్చే అర్జీలకు చాలా వరకు పరిష్కారాలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి. 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top