28 అంతర్జాతీయ రికార్డుల ‘సాహసపుత్రుడు’

Karate Champion Ibrahim Got 28 International Awards So Far - Sakshi

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చిన్నతనంలో స్నేహితులతో తరుచూ దెబ్బతినే చిన్నారిని ఆత్మస్థైర్యం కోసం కరాటే శిక్షణకు పంపింది తల్లి ఖాజాబీ. ఆ బాలుడు నేడు ఏకంగా 28 అంతర్జాతీయ కరాటే రికార్డులను సొంతం చేసుకున్నాడు. బాల్యం నుంచి క్రమం తప్పని సాధనతో పలువురికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. అతనే కరాటే మాస్టర్‌ ఇబ్రహిం. 

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో వెల్డింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న షేక్‌ మహబూబ్, ఖాజాబీల కుమారుడు షేక్‌ ఇబ్రహిం. చిన్నతనంలో ఆడుకునేటప్పుడు స్నేహితులతో గొడవలు, దెబ్బతిని ఇంటికి రావడం చూసి తల్లి ఖాజాబీ తట్టుకోలేకపోయింది. ధైర్యం నింపేందుకు కరాటే మాస్టర్‌ వద్ద  చేర్చింది. నిరంతరం సాధనతో ఇబ్రహింలో ధైర్యంతో పాటు కరాటే పట్ల ఆసక్తి పెరిగింది. ప్రదర్శనలిస్తూ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో 28 రికార్డులను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక, నేపాల్‌లో ప్రదర్శనలు ఇచ్చాడు. తాను ప్రదర్శించడమే కాకుండా తాను శిక్షణనిచ్చిన వందలాదిమంది శిష్యులతో కలిపి భారీ కరాటే ప్రదర్శన ఇవ్వడం ఇతని ప్రత్యేకత. 

చిన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసం మొదలైన కరాటే ప్రస్థానం రికార్డుల పరంపర సాగిస్తుంది. కరాటే విద్యే చిన్నారులకు నేర్పుతూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ.... ఇబ్రహిం జీవనం సాగడం విశేషం. 

2016 నుంచి ప్రారంభమైన రికార్డుల ప్రదర్శనలు 2020కి వచ్చేసరికి కరాటేలోని వివిధ రకాల విన్యాసాలతో ప్రదర్శనలతో సాధించిన పలు రికార్డులు..

 • 666 మందితో కటా ప్రదర్శన చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు (2016)
 • 5220 మందితో కరాటే ప్రదర్శన (2017)
 • 4250 మందితో కరాటే ప్రదర్శన లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డు (2017)
 • 600 మందితో కలాం వరల్డ్‌ రికార్డు (2018)
 • 60 మందితో మెరాకిల్‌ వరల్డ్‌ రికార్డు (2018)
 • ఆర్‌హెచ్‌ వరల్డ్‌ రికార్డు (2018)
 • ఏఎస్‌ఎస్‌ వరల్డ్‌ రికార్డు ( ఒక్క నిమిషంలో మోచేత్తో 195 స్టిక్‌లను బల్లమీద కొట్టడం (2019)
 • ఒక్క నిమిషంలో 60 మంది 2లక్షల 15 పంచ్‌లు (2019)
 • రియల్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు (2019)
 • సాహసపుత్ర రికార్డు (2019)
 • యూనివర్శల్‌ రికార్డు (2019)
 • ఎక్స్‌లెన్సీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు (2020)
 • వజ్రా వరల్డ్‌ రికార్డు (2020)
 • అఫిషియల్‌ వరల్డ్‌ రికార్డు (2020)
 • లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డు (2020)
 • గిన్నిస్‌బుక్‌ అటెంప్ట్‌ – (2020)
 • గిన్నిస్‌ రికార్డు ఎల్బో స్ట్రైకింగ్స్‌ (2020)
 • కలామ్స్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు (2021)
Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top