అర్జీలతో హోరెత్తిన పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

అర్జీలతో హోరెత్తిన పీజీఆర్‌ఎస్‌

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

అసలే మూగ.. బతికే ఉన్నా చంపేశారు

వెల్లువలా సమస్యలు

మళ్లీ మళ్లీ వస్తున్నా పరిష్కారమేదీ..!?

ఈమె పేరు షేక్‌ షర్మిల. మదనపల్లి పట్టణంలోని ఎన్‌వీఆర్‌ లే అవుట్‌. పుట్టుకతో మూగ, చెవుడు. భర్త కూడా మూగ వాడే. ఈమెకు విలాంగుల ఫించన్‌ వచ్చేది. ఏడాది క్రితంగా పింఛన్‌ నిలచిపోయింది. నిత్యావసర సరుకులు రావడం లేదు. కారణం ఏంటని సచివాలయానికి వెళ్లి అడిగితే వారు చెప్పిన మాట విని ఆమెకు సాయంగా వెళ్లిన వారు నిశ్చేష్టులయ్యారు. షర్మిల చనిపోయినట్లు రేషన్‌ కార్డులో డైడ్‌ అని ఉంది. దీంతో పింఛన్‌ రాలేదని చెప్పడంతో నిస్సహాయురాలైన ఆమె ఖంగుతింది. ఓ యూనియన్‌ నాయకుల సహకారంతో ఆమె సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌ను కలసి అర్జీ ద్వారా గోడు వెల్లబోసుకుంది.

మదనపల్లి (కురబలకోట): పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపిస్తున్నామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతివారం వెల్లువలా వచ్చి పడుతున్న అర్జీలు పరిష్కారం కాక మూలన చేరుతున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ఈ వారం కూడా కలెక్టరేట్‌ అర్జీదారులతో కిటకిటలాడింది. వ్యక్తిగత, సామాజిక, ఉపాధి హామీ అవకతవకలు, దారి సమస్య, చెరలో చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జా, భూ ఆక్రమణ, రీసర్వే లోపాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై సుమారు 374 దాకా అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పీజీఆర్‌ఎస్‌ అధికార కార్యక్రమం కాబట్టి ఏదో ఒక రోజు సమస్య పరిష్కారం కాకపోతుందా అనే ఆశతో వారం వారం అర్జీలతో క్యూకడుతున్నట్లు పలువురు ఆవేదనతో చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం.. చిత్తశుద్ధి లోపం... పైసలిస్తేగానీ ఫైలు ముట్టుకోని నైజంతోనే సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. మరి ఉన్నతాధికారులు ఈ విషయాలపై దృష్టి పెడతారో ... ఎప్పటిలాగే అర్జీలు తీసుకోవడంతోనే సరిపెడతారో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement