వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పట్టణంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చీకిలబైలుకు చెందిన శ్రీనివాసులు (33), అంగళ్లు మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్నాడు. రోజులాగే బైక్‌పై విధులకు వెళుతుండగా అమ్మ చెరువు మిట్టపై ఆటో ఢీకొనడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.

అదే రోజు అంకిశెట్టిపల్లికి చెందిన నారాయణరెడ్డి 65, స్థానిక గుడికి వెళ్లి స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా సమాధుల తోట వద్ద కారు ఢీకొని గాయపడ్డాడు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాలూకా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో టైలర్‌షాపులో మంటలు

పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు పులిచెర్ల రోడ్డులోని హరి టైలర్‌షాపులో సోమవారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.షాపు నుంచి మంటలు వస్తుండటం గమనించిన స్థానికులు షాపు యజమానికి సమాచారం అందించారు. ఆయన వెంటనే పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పేశారు.అప్పటికే షాపులోని కుట్టు మిషన్లు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. రూ.2లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులతో మాట్లాడగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

మదనపల్లె టౌన్‌ : అతిగా మద్యం తాగి ఓ నాయీ బ్రాహ్మణుడు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మదనపల్లెలో వెలుగుచూసింది. సత్యసాయి జిల్లా, కదిరి పిల్ల వంక కాలనీకి చెందిన నారాయణ అదే ప్రాంతంలో బార్బర్‌షాపు నిర్వహిస్తున్నాడు. మృతుని భార్య భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజులుగా షాపుకు వెళ్లకుండా ఇంట్లోనే అతిగా మద్యం తాగుతూ ఉన్నాడు. ఆదివారం రాత్రి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని చికిత్స కోసం స్విమ్స్‌కు తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీఎల్‌ మ్యాచ్‌లు విజయవంతం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడపలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌–5 మ్యాచ్‌లు విజయవంతమైనట్లు ఏసీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ మెంబర్‌ భరత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎల్‌ మ్యాచ్‌లు కడపలో నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నాయకులు కేశినేని చిన్ని, సానా సతీష్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కడప ప్రజలు వేలాదిగా తరలివచ్చి మ్యాచ్‌లను వీక్షించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇటువంటి మ్యాచ్‌లు దోహదపడతాయన్నారు. వైఎస్‌ రాజారెడ్డి స్టేడియాన్ని ధర్మశాల స్టేడియంతో పోల్చడం గర్వంగా ఉందన్నారు. ఈ మ్యాచ్‌లో పాల్గొన్న ఏడు టీముల క్రీడాకారులు స్టేడియాన్ని చూసి అద్భుతంగా ఉందని కొనియాడారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నాయకులు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరో ఐదు వేల మంది మ్యాచ్‌లను వీక్షించేందుకు అదనంగా స్టేడియం సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement