విలీనం వద్దు.. మా ఊర్లోనే బడి కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

విలీనం వద్దు.. మా ఊర్లోనే బడి కొనసాగించాలి

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

చౌడేపల్లె : మండలంలోని వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లెలో గల ప్రభుత్వ పాఠశాలలోని3,4,5 తరగతుల విద్యార్థులను మర్రిమాకులపల్లె ప్రభుత్వ పాఠశాలలో విలీనం వద్దు.. మా ఊర్లోని బడిలోనే ఆ తరగతులను కొనసాగించాలని తల్లితండ్రులు ఎంఈఓ కేశవరెడ్డిని కోరారు. సోమవారం గాజులవారిపల్ల పాఠశాలలో గ్రామస్తులు, తల్లితండ్రులతో ఎంఈఓ, ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఈ పాఠశాలనుంచి 12మంది విద్యార్థులు మర్రిమాకులపల్లె పాఠశాలలో చేరాల్సి ఉంది. పాఠశాల పునఃప్రారంభమై పదిరోజులవుతున్నా విలీనం చేసిన బడికి విద్యార్థులు వెళ్లకపోవడంతో సమాచారం అందుకొన్న ఎంఈఓ గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తల్లితండ్రులు దీనికి ససేమిరా అన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో గల తమ గ్రామంనుంచి మర్రిమాకులపల్లెకు సుమారు 2 కిలోమీటర్లకు పైగా పిల్లలునడిచి వెళ్లాలని, పిల్లలకు భద్రత ఎలా చెప్పండి అని ప్రశ్నించారు. ట్రావెల్‌ చార్జీలు ఇస్తామని చెప్పినా తిరస్కరించారు. తమ గ్రామంలో ఉన్న బడిలోనే 5వ తరగతి వరకు కొనసాగిస్తే తమ పిల్లలను బడికి పంపుతామని లేకుంటే పంపేది లేదన్నారు. సమీపంలోని మోట్లపల్లె పాఠశాలలో ఉన్న 13మంది విద్యార్థులతో కలిపి గాజులవారిపల్లెలోనే 5వ తరగతి వరకు కొనసాగించేలా చూడాలని కోరారు. ఈ విషయం గురించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఎంఈఓ పేర్కొన్నారు. కాగా మర్రిమాకులపల్లె ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మురళీమోహన్‌ వ్యవహార శైలి బాగాలేదని, దురుసుగా ప్రవర్తించడంతోపాటు తల్లితండ్రులను హేళన చేస్తూ మాట్లాడారని ఎంఈఓ ఎదుట వాగ్వాదం జరిగింది. ఇకమీదట అలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని ఎంఈఓ తెలిపారు.

ఎంఈఓకు తల్లితండ్రుల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement