దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలి

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు సంగటి చిన్న ఏసోబు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌సీఎం బిషప్‌ సగినాల పాల్‌ప్రకాశ్‌ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్సీలు ఏ మతంలో చేరినా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారుగానీ క్రెస్తవ మతం స్వీకరిస్తే అమలు చేయకపోవడం ఏపాటి న్యాయమని ప్రశ్నించారు. మతం మారే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలన్నారు. దళిత క్రైస్తవుల పట్ల వివక్ష ఉండరాదన్నారు. తమ న్యాయమైన పోరాటానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహాజన రాజ్యం పార్టీ నాయకుడు సంగటి మనోహర్‌ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు, రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్దమన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం పార్టీమెంట్‌కు సైతం లేదని స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ తీసుకొచ్చినపుడు ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. దీంతో ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్‌.వెంకట శివ మాట్లాడుతూ పార్లమెంటులో చట్టసవరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎస్‌ఏ సత్తార్‌, బండి జకరయ్య, ఫాదర్‌ ఆనంద్‌, ఫాదర్‌ సగిలి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement