సదుం/ చిత్తూరు అర్బన్ : మైనర్ బాలికపై లాంగిక దాడికి పాల్పడ్డ కేసులో వగళ్ల మోహన్ రెడ్డి (37) అనే ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన కుమారి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. సదుం మండలం గుట్టమీదపల్లె బస్టాప్ వద్ద 2014 మే 24వ తేదీన 17 ఏళ్ల బాలిక బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్‌రెడ్డి తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక, ఆటోను డైవర్ట్ చేసి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బటయ చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అదేరోజు బాలికను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. బాలికను వదిలేయాలని మోహన్‌రెడ్డి స్నేహితుడు చెప్పగా, అక్కడే వదిలేశాడు. ఆపై బాలిక తన స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీనిపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సదుం పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తిగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. ఇక బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం తరపున అందచేయాలని జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.


