కడప వైఎస్సార్ సర్కిల్ : కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఏపీఎల్ రసవత్తర పోరులో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సర్వశ్రేష్ఠ ప్రదర్శనతో తుంగభద్ర వారియర్స్ పై 6 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తుంగభద్ర నిర్దేశించిన 133 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని రాయలసీమ బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా, మరో 35 బంతులు మిగిలి ఉండగానే కేవలం 14.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించారు.
పవర్‌ప్లేలోనే కోలుకోలేని దెబ్బ
తొలుత టాస్ గెలిచిన రాయలసీమ కెప్టెన్ ధ్రువ కుమార్ రెడ్డి తుంగభద్ర వారియర్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తుంగభద్ర వారియర్స్ బ్యాటింగ్ రాయలసీమ బౌలర్ల ధాటికి తీవ్రంగా ఒడిదొడుకులకు లోనైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 132 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. రాయలసీమ బౌలర్లు పవర్‌ప్లేలోనే కోలుకోలేని దెబ్బతీశారు. కల్ది అజయ్ కుమార్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఓపెనర్లు కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ (1), శ్రీ సమన్యు దత్తా (2)లతో పాటు కాకి సూర్య జయంత్ (5)లను పట్టుమని 10 పరుగులు కూడా దాటకముందే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత పార్థసారథి కూడా చెలరేగడంతో తుంగభద్ర జట్టు 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడింది.
ఆనంద్ జోసియా ఒంటరి పోరాటం
వికెట్లు పడుతున్నా ఒక ఎండ్‌లో గుత్తా రోహిత్ (34 బంతుల్లో 28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయగా, మిడిలార్డర్ బ్యాటర్ కంచెర్ల ఆనంద్ జోసియా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. రాయలసీమ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆయన.. కేవలం 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 160.53 స్ట్రైక్ రేట్‌తో 61 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్ వల్లే తుంగభద్ర జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. రాయల్స్ ఆఫ్ రాయలసీమ బౌలర్లలో పార్థసారథి జి.జి అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (3/20) పడగొట్టాడు. ఆయనకు తోడుగా కల్ది అజయ్ కుమార్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు (3/24) తీసి టాప్ ఆర్డర్‌ను క్లీన్ చేయగా, గణేష్ సతివాడ 2 వికెట్లతో తుంగభద్ర పరుగుల వేగాన్ని పూర్తిగా అడ్డుకున్నారు.
గరిమెళ్ల తేజ విధ్వంసం
లక్ష్య చేధనలో రాయలసీమకు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ ధ్రువ కుమార్ రెడ్డి (0) మొదటి బంతికే అవుట్ కాగా, సిహెచ్ సాయి సందీప్ 6 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వై.తేజ రెడ్డి (9), జి.మన్విత్ రెడ్డి (5)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గరిమెళ్ల తేజ తుంగభద్ర బౌలర్లపై పగబట్టినట్లు విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు అతనికి తోడుగా ఎ.సాయి సూర్య తేజ (24 బంతుల్లో 30 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. తుంగభద్ర బౌలర్లలో మాధా దీపక్ 2 వికెట్లు తీశారు.


