రాయచోటి టౌన్ : వీధుల వెంట చెత్త సేకరించి తీసుకెళ్లే మున్సిపల్ ట్రాక్టర్ పాతరాయచోటి శివాలయం వీధిలో ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం వీధుల వెంట మొత్తం చెత్తను సేకరించి తీసుకెళ్లుతోంది. రోడ్డు వెంట వెళ్లాల్సిన ట్రాక్టర్.. రోడ్డు దిగి పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇంటి గోడను ఢీకొన్న కారు
పుంగనూరు : పట్టణంలోని నక్కబండలో ఓ బాలుడు కారు నడిపి ఇంటి గోడను ఢీకొనడంతో బాలుడు స్వల్పంగా గాయపడిన సంఘటన ఆదివారం జరిగింది. నక్కబండ ప్రాంతానికి చెందిన బాలుడు సరదాగా కారు నడుపుతూ అక్కడ ఇంటి గోడను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి గాయాలయ్యాయి. కారు ముందుభాగం దెబ్బతింది. వెంటనే ఆ ప్రాంత వాసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె టౌన్ : భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వర్గానికి చెందిన తండ్రి, కుమారుడితోపాటు మరో వర్గానికి చెందిన ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ ఎనమలవారిపల్లెలో ఈ ఘటన జరిగింది. బాధితులు ఆదివారం తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ కుమార్, త్రిలోక్ కుమార్ వర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయమై త్రిలోక్ కుమార్, అతని పిన తండ్రి మోహన్ రావ్ ఇంటికి సునీల్ కుమార్ తన వర్గీయులు చిట్టిబాబు, రామచంద్రతో కలిసి అర్ధరాత్రి వెళ్లి గొడవకు దిగారు. ‘మా నాన్నతో అసభ్యంగా ఎందుకు మాట్లాడావు’ అంటూ ప్రశ్నించడంతో మాటకుమాట పెరిగింది. ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తితో.. వారిస్తున్న త్రిలోక్ కుమార్‌పై సునీల్ కుమార్ దాడి చేశాడు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఇరు వర్గాల వారు పరస్పరం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ చంద్రమోహన్, సీఐ కళా వెంకటరమణ కేసు విచారణ చేస్తున్నారు.
చిన్నమండెం : మండలంలోని వండాడి గ్రామం కదిరోళ్లపల్లె వద్ద ఆదివారం టమాట లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం వెనుక టైరు పగిలి బోల్తా పడింది. మదనపల్లె నుంచి టమోటా లోడుతో విజయవాడకు కడప–బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రాణనష్టం, గాయాలు కాకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. క్రేట్లు కింద పడటంతో టమాటలు రోడ్డు పాలయ్యాయి.


