గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. సీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం.
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. మదనపల్లె డిపో నుంచి ఉదయం 6.00, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయని పేర్కొన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
సాక్షి, మదనపల్లె : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్‌లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని వివరించారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
సాక్షి, మదనపల్లె : విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోమ వారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని డిస్కం జిల్లా ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు 94408 17449 నెంబరు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నేడు ఎంపీ మిథున్‌రెడ్డి రాక
సాక్షి, మదనపల్లె : రాజంపేట ఎంపీ, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పీవీ.మిథున్‌రెడ్డి సోమవారం మదనపల్లెకు రానున్నారని ఆ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆదివారం తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు మిథున్‌రెడ్డి స్థానిక ఎంపీ కార్యాలయానికి చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉంటారని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసి ‘సర్’తో పాటు వివిధ అంశాలపై సమీక్షిస్తారని వెల్లడించారు.
నేడు కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి వైఎస్సార్ కడపజిల్లాకు చెందిన డీఎస్సీ 2008, డీఎస్సీ 1998 మినిమమ్ టైమ్ స్కిల్(ఎంటీఎస్) ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ల కేటాయింపునకు సోమ వారం కడపలోని డీఈఓ కార్యాలయం ఆవరణలో కౌన్సెలింగ్ జరగనుంది. ఈ విషయా న్ని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. పైన పేర్కొన్న ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు నిర్ణీత తేదీ, సమయానికి హాజరుకాని మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు తదుపరి ఎటువంటి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉండదని డీఈఓ పేర్కొన్నారు.
హార్సిలీహిల్స్ వద్ద తనిఖీలు
మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ వద్ద ఆదివారం ట్రాన్స్‌పోర్ట్, పోలీస్ శాఖలు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించాయి. హార్సిలీ హిల్స్‌పైకి వెళ్లే వాహనాలను లక్ష్యంగా చేసుకుని డీటీఓ అశోక్ ప్రతాప్ రావు, బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్క రోజులోనే రూ.37,800 జరిమానా వసూ లు చేశారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, బి.కొత్తకోట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


