సరిగ్గా ఏడాది క్రితం, కొండపై పర్యాటకాన్ని అంబరానికి ఎత్తేస్తామంటూ ముగ్గురు అగ్రశ్రేణి ఐఏఎస్ అధికారులు..అప్పటి కలెక్టర్ శ్రీధర్, జేసీ ఆదర్శ్ రాజేందర్, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఇక్కడికి విచ్చేశారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ’చిలకరిస్తూ’.. నీటిని తుంపర్లుగా వెదజల్లే కలర్‌ఫుల్ ఫౌంటెయిన్, రాళ్లపై నుంచి రొమాంటిక్‌గా దుముకే ఆర్టిఫిషియల్ జలపాతాన్ని కొబ్బరికాయలు కొట్టి అట్టహాసంగా ప్రారంభించారు. అధికారులు అలా కొండ దిగారో లేదో.. వారం తిరక్కముందే ఈ ఫౌంటెయిన్ మోటార్లు కూడా శాశ్వతంగా ’స్విచ్చాఫ్’ అయిపోయాయి. నిర్వహణను గాలికి వదిలేయడంతో, ఇప్పుడు ఆ లక్షల రూపాయల ఫౌంటెయిన్ కాస్తా పర్యాటకులు పడేసే ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లకు అఫీషియల్ ’డస్ట్‌బిన్’గా ప్రమోషన్ పొందింది. కొండపై తాగడానికి నీళ్లు లేక పర్యాటకులు అల్లాడుతుంటే.. ఇక్కడ మాత్రం లక్షలు పోసి ’మురికి దిబ్బ’ను తయారు చేయడం అధికారుల క్రియేటివిటీకి నిదర్శనం. ట్విస్ట్ ఏమిటంటే..ఇటీవలే ప్రస్తుత కలెక్టర్, టౌన్‌షిప్ కమిటీ చైర్మన్ (సబ్ కలెక్టర్), పర్యాటక శాఖ అధికారులు తదితర బృందమంతా కాన్వాయ్ కట్టుకుని హార్సిలీహిల్స్‌పై ’రౌండ్స్’ వేశారు. ముఖద్వారం వద్దే కళ్లెదుట వెలిగిపోతున్న ఈ ’సుందర మురికి గుంట’ను దాటుకునే కొండపైకి వెళ్లినా.. ఒక్క అధికారి కంటికి కూడా ఇది ఆనకపోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద వింత! ఈ ఫౌంటెయిన్‌ను చూసి పర్యాటకులు ‘కొత్తగా వచ్చే పర్యాటకులు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటానికి, ముఖద్వారం వద్దే అధికారుల నిర్లక్ష్యం ఏ రేంజ్‌లో ఉంటుందో లైవ్ డెమో చూపించడానికి ఈ ఏర్పాటు చేసినట్లున్నారు‘ అని పరాచికాలాడుతున్నారు. – టి.షామీర్‌బాషా(సాక్షి,మదనపల్లె)


