● చరిత్రకు సాక్ష్యంగా శిలలు
● పడమటి ప్రాంతంలో
ఆరో శతాబ్ధం నాటి ఆనవాళ్లు
ములకలచెరువు: పడమటి రాయలసీమ పల్లెల్లో నేటికీ అడుగడుగునా దర్శనమిచ్చే రాతి మండపాలు, వాటిలో పోరాట భంగిమల్లో చెక్కిన ఎత్తయిన శిలలు కేవలం సాధారణ కట్టడాలు కావు.. శతాబ్దాల నాటి వీర యోధుల నెత్తుటి గాథలకు సజీవ సాక్ష్యాలు. బాణులు, వైదుంగులు ఏలిన సామంతుల కాలం నాటి సరిహద్దు సమరాలైనా.. పాలెగాళ్ల కాలంలో సాగిన దివిటీ దొంగల దండయాత్రలైనా.. ఊరి ఆత్మగౌరవాన్ని, పశుసంపదను కాపాడేందుకు ప్రాణాలర్పించిన సామాన్య అమరవీరుల త్యాగాలను ఈ ‘వీరశిలలు’ నేటికీ చాటిచెబుతున్నాయి.
8వ శతాబ్దపు యోధుడు ‘కత్తి వీరయ్య’
ఒకప్పుడు పడమటి పల్లెలకు రాత్రి పూట కంటిమీద కునుకు ఉండేది కాదు. దొంగల గుంపులు పడి దోచుకోవడం, అడ్డువచ్చిన వారిని నరకడం, ఆడవాళ్లను చెరబట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవి. ఈ అరాచకాలను ఎదిరించడానికి ‘కత్తి వీరయ్య’ అనే యోధుడు నడుం బిగించాడు. కత్తి యుద్ధంలో ఆరితేరిన వీరయ్య, తన ఊరి యువకులను పోగేసి ప్రత్యేక పోరాట శిక్షణ ఇచ్చి ఒక దళాన్ని తయారుచేశాడు. వీరయ్య చేతిలో కత్తి ఉందంటే ఎదురునిలిచే దమ్ము ఏ దోపిడీ ముఠాకూ ఉండేది కాదు. ఎన్నో దొంగల ముఠాలను ఈ దళం మట్టుబెట్టింది. చివరకు దొంగలతో జరిగిన ఒక భీకర పోరులో వీరయ్య వీరమరణం పొందాడు. ఈ పరాక్రమానికి గుర్తుగా బి.కొత్తకోట మండలం ఆలేటివారిల్లె శివార్లలో నేటికీ 7 అడుగుల ఎత్తయిన భారీ వీరశిల దర్శనమిస్తుంది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఈ వీరశిలపై వీరయ్య పరాక్రమ సంగతులను దేవనాగరి లిపిలో శాసనంగా చెక్కారు.
12వ శతాబ్దంలో ములకలచెరువు మండలంలోని గూడుపల్లె సమీపంలో పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న చెన్నప్పగారిపల్లె అగ్రహారం మీద దివిటీ దొంగలు అరాచకానికి తెగబడ్డారు. అప్పుడు బలిజ వీరుడు వీర చెన్నకేశవ నాయకత్వంలో ఊర్లోని యువకులు ఆత్మరక్షణ పోరాటం సాగించారు. దొంగలతో జరిగిన భీకర పోరులో చెన్నకేశవతో పాటు ఆయన అనుచరులు కొందరు వీరమరణం పొందారు. నేలకొరిగిన ఆ యోధుల జ్ఞాపకార్థం గూడుపల్లె పంచాయతీ చెరువుకిందపల్లె శ్మశానంలో కత్తి, డాలు పట్టుకుని యుద్ధం చేస్తున్నట్లు ఉండే చెన్నకేశవ వీరశిలను, మండపాన్ని ప్రతిష్ఠించారు. ఇది 12వ శతాబ్దపు పోరాటానికి సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఇది కాకుండా, ములకలచెరువు మండలం పెద్దపాళ్యం పంచాయతీ రామానాయునికోట సమీపంలో పెద్దేరు ఒడ్డున కూడా 11వ శతాబ్దానికి చెందిన మరో వీరశిల ఉంది.
ఆరో శతాబ్దం నుంచే స్మరణ సంప్రదాయం
క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో పశ్చిమ చాళుక్య చక్రవర్తి రెండో పులకేసి కాలం నుంచే ఇలా అమరులైన వీరులను స్మరిస్తూ శిలలను నాటే సంప్రదాయం ఉన్నట్లు ఈ ప్రాంతంలో లభించిన శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.
చెన్నకేశవ సమాధిపై ఏర్పాటు చేసిన
రాతి వీరశిలపై చెక్కిన కత్తి, డాలు
ఆలేటివారిపల్లె సమీపంలో కత్తి వీరయ్య సమాధిపై ఏర్పాటు చేసిన వీరశిల
చరిత్రకు సాక్ష్యాలుగా నిలవాల్సిన ఈ వీరశిలలు ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురై అంతరించిపోతున్నాయి. సంరక్షణ కరువై ఎన్నో శిల్పాలు కూలిపోతుండగా.. బి.కొత్తకోట బీసీ కాలనీ రోడ్డు పక్కన, కురబలకోట రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న అత్యంత విలువైన వీరశిలలను గతంలో గుప్తనిధుల ముఠాలు ధ్వంసం చేసి, పగులగొట్టడంతో అవి ముక్కలై పడి ఉన్నాయి. మన పూర్వీకుల త్యాగాలకు ప్రతీకలైన ఈ చారిత్రక సంపదను పురావస్తు శాఖ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని చరిత్ర పరిశోధకులు, స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


