పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ నమోదు ప్రక్రియ షురూ | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ అడ్మిషన్‌ నమోదు ప్రక్రియ షురూ

Jun 21 2026 5:28 AM | Updated on Jun 21 2026 5:28 AM

రాయచోటి టౌన్‌ : పాలిటెక్నికల్‌ అడ్మిషన్ల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని రాయచోటి పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పి.శివశంకర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలీసెట్‌ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ల ద్వారా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 24 నుంచి 30వ తేది వరకు ఆన్‌లైన్‌ ద్వారా సర్టిఫికెట్‌లు వెరిఫికేషన్‌, ప్రాసెసింగ్‌ఫీజుల చెల్లింపు పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఆన్‌లైన్‌ ద్వారా ధృవీకరణ పూర్తి కానివారు/ వివరాలలో మార్పులు అవసరం అయిన వారు 25వ తేది నుంచి జులై 1వ తేది వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసుకోవాలని సూచించారు. వెబ్‌ ఆప్షన్‌లు నమోదు 29 నుంచి జులై 3వ తేది వరకు, వెబ్‌ ఆప్షన్లు మార్పు కోసం జులై 4వ తేది ఉంటుందని, సీట్లు కేటాయింపు జులై 6వ తేది ఉంటుందని, స్వీయ నివేదిక, కళాశాలలో రిపోర్టింగ్‌ జులై 7వ తేది నుంచి 10వ తేది వరకు ఉంటుందని వివరించారు.

మెరుగైన ఆరోగ్య సేవలు

అందించాలి

పీలేరు : గ్రామీణ ప్రాంతంలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ ఉషశ్రీ అన్నారు. శనివారం స్థానిక మోడల్‌ కాలనీలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య రక్షణలో భాగంగా శిశువులకు వేసే టీకాల వివరాలు, వాటి ప్రయోజనాలపై శిశువు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం 0–5 పిల్లల ఆరోగ్య సంక్షేమానికి నిర్వహిస్తున్న ‘స్టాఫ్‌ డయేరియా’ కార్యక్రమంలో జింక్‌ మాత్రలు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం ప్రాముఖ్యతను తల్లులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో శ్రీనివాసులు, ఏఎన్‌ఎంలు అరుణ, సీహెచ్‌వో సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

సచివాలయానికి తాళం

సాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలోని మోతి నగర్‌ సచివాలయానికి శనివారం తాళం పడింది. వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉండాల్సిన సచివాలయం తాళం వేసి ఉండడం చూసి జనం ముక్కునవేలేసుకున్నారు. సచివాలయ సేవలు సక్రమంగా అందడం లేదన్న విమర్శలకు ఈ ఘటన బలం చేకూరుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement