పై సంచి నిండా ఉన్నది కేవలం వేరుశెనగ కాయలు మాత్రమే కాదు.. ఒక నిరుపేద రైతు గుండెల్లో దాచుకున్న ఖరీఫ్ ఆశలు! వర్షాలు పడకపోయినా, అప్పుల భారం వెంటాడుతున్నా.. ‘భూమి తల్లిని నమ్ముకుంటే ఏదో ఒకరోజు బతుకు నిలబడుతుంది’ అనే నమ్మకంతో రైతు చేతులు చాచాడు. కష్టకాలంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీ దక్కుతుందని ఆశపడి, అక్షరాలా రూ. 1,890 చేతిలో పెట్టి ‘నారాయణి రకం’ విత్తనాల సంచిని ఇంటికి తెచ్చుకున్నాడు. తీరా పొలంలో చల్లుకుందామని ఆశల సంచి విప్పిన రైతుకు.. గుండె ఆగినంత పనైంది. కాయల నిండా పొట్టు, ఎండిపోయిన పుల్లలు, మట్టి తప్ప గింజల ముచ్చటే లేదు. కాయలను కనీసం శుద్ధి (గ్రేడింగ్) కూడా చేయకుండా, చెత్తాచెదారంతో నింపేసి రైతుల కళ్లు గప్పారు. అందులో ఉన్న కాయలన్నీ గింజ లేని ‘బుడతలు’గా, చప్పిడిగా మారిపోయాయి. 30 కేజీల బరువున్న ఈ సంచిలో సగం కాయలు కూడా మొలకెత్తడానికి పనికొచ్చేలా లేవంటే క్షేత్రస్థాయిలో దగా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. – కేవీ పల్లె


