సిలిండర్‌ నుంచి మంటలు... ఇద్దరికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ నుంచి మంటలు... ఇద్దరికి తీవ్రగాయాలు

Jun 21 2026 5:28 AM | Updated on Jun 21 2026 5:28 AM

మదనపల్లె టౌన్‌ : గ్యాస్‌ సిలిండర్లో మంటలు చెలరేగి ఇంటి యజమాని సహా మెకానిక్‌ సైతం తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం మదనపల్లి పట్టణంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని రామనగర్‌లో నివాసముంటున్న నరసింహులు, శారద ఇంట్లో కొద్దిరోజులుగా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. ఈ క్రమంలో గ్యాస్‌ సిలిండర్లు, స్టౌలు రిపేర్‌ చేస్తానని స్థానిక అప్పారావు తోటకు చెందిన ఆయాజ్‌(52) శనివారం ఉదయం శారద ఉంటున్న వీధికి వచ్చాడు. గమనించిన శారద తన ఇంట్లో ఉన్న సిలిండర్లో గ్యాస్‌ లీక్‌ అవుతున్న విషయాన్ని ఆయాజ్‌కు చెప్పి రిపేర్‌ చేయాలని కోరింది. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్‌ ను బయటకు తీసుకొచ్చి రిపేరు చేసే క్రమంలో సిలిండర్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆయాజ్‌ తో పాటు శారద సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement