వాల్మీకిపురం : వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని ఇట్లంవారిపల్లి వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై బాలక్రిష్ణ కథనం మేరకు.. శనివారం మండలంలోని ఇట్లంవారిపల్లి వద్ద కాచిగూడ నుంచి మధురైకి వెళ్తున్న రైలుకు ఎదురగా వెళ్లి గుర్తు తెలియని యువకుడు (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఇట్లంవారిపల్లి బ్రిడ్జి సమీపంలో మరో యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. ఇతను అస్సాం రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. ఆధార్ కార్డులో పేరు టి.చైతు (36), తండ్రి టి.మంజుగా గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే ఎస్సై బాలక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


