రాయచోటి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యార్థుల అభ్యాసన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. రాయచోటి మండల పరిధిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలు, విద్యా ర్థుల అభ్యాస స్థాయిలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర – నెట్‌జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలోని వంటశాల, భోజనశాల, ఇతర సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని స్వయంగా పరిశీలించారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ సునీల్‌కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


