నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌ పథకం అమలుకు ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌ పథకం అమలుకు ఎంఓయూ

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

రాయచోటి : రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ‘నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికై న విద్యాసంస్థల్లో పథకం అమలుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించిందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలోని చాంబర్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ సమక్షంలో కన్హాహార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సంబంధిత పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం విదితమే. జిల్లా నుంచి 48 విద్యాసంస్థలు ఎంపికకావడం హర్షణీయమని కలెక్టర్‌ చెప్పారు. 1.5 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లు ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ వెంకటరత్నం, కన్హా హార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యలు వేగంగా పరిష్కరించాలి.

రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో రెండో శుక్రవారం ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతిపత్రాలను జిల్లా కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌లు స్వీకరించారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి మరింత చేరువ కావాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఒక నియోజకవర్గం – ఒక మండలం – నాలుగు సందర్శనాలు కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ యామిని, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, విద్య, వైద్య, నీటిపారుదల శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement