● మోగుతున్న పెళ్లిభాజాలు
మదనపల్లె సిటీ: అధిక జ్యేష్టమాసం ముగిసి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రాంతాల్లో శుభకార్యాలకు సంబఽంధించి హడావుడి ప్రారంభమైంది. ఆయా ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. అధిక జ్యేష్టమాసంలో ముహుర్తాలు ఉండవు. నిజజ్యేష్టమాసం ప్రారంభం కావడంతో ఈనెల 16 నుంచి నెల రోజుల పాటు ముహుర్తాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు వివాహాలకు, గృహప్రవేశాలకు,ఇతర శుభకార్యక్రమాలకు అనువుగా ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. అలాగే నెల తర్వాత మళ్లీ శ్రావణమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నిజ జ్యేష్టమాసం ముగిసిన తరువాత వచ్చే ఆషాడంలో ముహుర్తాలు ఉండవు. జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు దాదాపు ఆ నెలరోజులు శుభకార్యాక్రమాలకు బ్రేక్ పడుతుంది. తర్వాత మళ్లీ భాద్రపదమాసంలోనూ శుభ కార్యక్రమాలకు అవకాశముండదని పండితులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగు మాసాల్లో వందలాది వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు వెయ్యికిపైగా కళ్యాణమండపాలు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్‌కు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా పట్టుచీరల కోసం మదనపల్లె (నీరుగట్టువారిపల్లె), బంగారు కొనుగోలు కోసం ప్రొద్దుటూరు ప్రాంతాలోని వాణిజ్యకేంద్రాల్లో సందడి నెలకొంది.
’ముఖ్యమైన ముహుర్తాలు:
మంచి ముహుర్తాలు ఉన్నాయి
నిజజ్యేష్టం, శ్రావణం, ఆశ్వీయుజ మాసాల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. అధిక జ్యేష్టం, ఆషాడం, భాద్రపదాలు శూన్యమాసాలు కావడంతో ముహుర్తాలు ఉండవు. కాబట్టి ముహుర్తాలు ఉన్న మాసాల్లో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరగడానికి అవకాశముంది. ఇప్పటికే చాలా మంది వివాహ ముహుర్తాలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
– ఆలూరి ఫణికుమార్‌శర్మ,
వేదపండితులు,మదనపల్లె.


