రెండేళ్లలో జిల్లా అభివృద్ధి శూన్యం ! | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో జిల్లా అభివృద్ధి శూన్యం !

Jun 19 2026 2:00 AM | Updated on Jun 19 2026 2:00 AM

కూటమిపాలనలో ఏం ఒరిగిందో చెప్పని మంత్రులు, ఎమ్మెల్యేలు

గత ప్రభుత్వంపై విమర్శలకే నేతల ప్రత్యేక శ్రద్ధ

సాక్షి, మదనపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి శూన్యమనే విషయం రెండేళ్ల పండగ సభ సాక్షిగా తేలిపోయింది.గురువారం మదనపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం పేరిట ఓ ఉత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వచ్చారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక విమర్శలు, ఆరోపణలు, గత ప్రభుత్వంపై నిందలు, చంద్రబాబుపై ప్రశంసలకే సభ పరిమితమై ముగిసింది.

ఒక్క అభివృద్ధి మాట లేదు

తొలుత కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ జలధార, పింఛన్ల గురించి కొద్దిసేపు వివరించారు. ఆపై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దన్‌ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ గత పాలనలో ఏమి జరగలేదని, అభివృద్ధి, సంక్షేమం లేదని, కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆత్మస్తుతి పరనిందకే పరిమితమయ్యారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన ఈ సభలో ఈ రెండేళ్లలో ప్రభుత్వం జిల్లాకు ఏం అభివృద్ధి చేసింది అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు. జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లెకు తరలించడం మినహా జరిగిన అభివృద్ధి ఏది లేదన్న విషయం మంత్రుల మాటల్లోనే తేటతెల్లమైంది. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇద్దరు మంత్రులు తమ ప్రభుత్వం ఫలానా చేసిందని చెప్పుకుని ఉండేవారు కదా అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.

చంద్రబాబు తెచ్చారట

రూ.2,400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌.జగన్‌ మంజూరు చేసి పనులు చేపట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టును దివంగత నేత వైఎస్సార్‌ చేపట్టారు. ఈ రెండు పనులు చేపట్టిన ఘనత చంద్రబాబుదని ఎమ్మెల్యే కిశోర్‌ కుమార్‌ రెడ్డి సభ సాక్షిగా అబద్ధాలు వల్లె వేయడం గమనార్హం. కిశోర్‌ కుమార్‌ రెడ్డి మాటలపై అక్కడికొచ్చిన ప్రజలే ముక్కున వేలేసుకున్నారు. ఇతరులు చేసిన పనిని తాము చేశామని చెప్పుకోవడం విడ్డూరమని చర్చించుకోవడం కనిపించింది.

వేదిక నిండా నాయకులే

అధికారిక కార్యక్రమమైనా వేదికపై కలెక్టర్‌ తప్ప మిగతా వాళ్లంతా కూటమికి చెందిన రాజకీయ నాయకులే ఉన్నారు. వారిలో అధికారిక హోదా కలిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు, మరో ఇద్దరు మినహా అంతా పార్టీ క్యాడరే ఉన్నారు. రెండేళ్ల ప్రభుత్వ అభివృద్ధిపై నిర్వహించిన సభ టీడీపీ సభగానే ముగిసింది. సభ మధ్యలో మహిళలు, క్యాడర్‌ వెళ్ళిపోతుండగా ఎమ్మెల్యే మైక్‌ తీసుకొని కూర్చోమంటూ అభ్యర్థించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement