సాక్షి ప్రతినిధి, కడప: కడప రాజారెడ్డి స్డేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగిన మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్, అమరావతి రాయల్స్‌పై 44పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్ లయన్స్‌కు ప్రారంభంలోనే కెప్టెన్ రికీ భుయ్ (5) వికెట్ కోల్పోయి పెద్ద షాక్ తగిలింది. ఆ ఒత్తిడిని ఏమాత్రం క్షేత్రస్థాయిలోకి రానివ్వకుండా కోగటం హనీష్ వీరా రెడ్డి (34 బంతుల్లో 62), మహీప్ కుమార్ (41 బంతుల్లో 62) మూడో వికెట్‌కు అద్భుతమైన జుగల్ బందీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆఖర్లో మార్తల ధనుష్ 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 257 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 36 పరుగులు సాధించి ఫినిషర్ పాత్రను పోషించడంతో వైజాగ్ లయన్స్ 20 ఓవర్లలో 202 పరుగుల భారీ కొండను బోర్డుపై ఉంచగలిగింది.
చేతులెత్తేసిన అమరావతి
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ జట్టుకు రన్ రేట్ ఒత్తిడి ఆరంభం నుంచే శాపంగా మారింది. కెప్టెన్ యర్రా సందీప్ (17), వరుణ్ సాత్విక్ (8)లు పవర్‌ప్లేలోనే వికెట్లు సమర్పించుకున్నారు. ఉప్పర గిరినాథ్ (37) కొద్దిసేపు నిలకడగా ఆడినా ‘రిటైర్ అవుట్’ కావడం ఆశ్చర్యపరిచింది. మిడిలార్డర్‌లో ఎస్.దుర్గ వరాప్రసాద్ (31 బంతుల్లో 42) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరోవైపు కరణ్ షిండే (2), కేవీ శశికాంత్ (0) వంటి లీగ్ సీనియర్లు వైఫల్యం చెందడంతో అమరావతి 19 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది.
వైజాగ్ లయన్స్ బౌలర్ల పంజా
వైజాగ్ లయన్స్ భారీ స్కోరు చేయడమే కాకుండా బౌలింగ్‌లోనూ అత్యంత పదునైన వ్యూహాలను అమలు చేసింది. ముఖ్యంగా పి.గిరినాథ్ రెడ్డి (3/29) మిడిలార్డర్ వెన్ను విరవగా, కె.ప్రమోద్ కుమార్ (3/34) టెయిల్ ఎండర్లను క్లీన్ చేసి అమరావతి పతనాన్ని వేగవంతం చేశారు. షేక్ మహ్మద్ కామిల్ (3 ఓవర్లలో 13 రన్స్) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రన్ రేట్ పెరిగేలా ఒత్తిడి తెచ్చాడు.


