ఖాకీ గంజాయి నాటకం..బూటకం | - | Sakshi
Sakshi News home page

ఖాకీ గంజాయి నాటకం..బూటకం

Jun 19 2026 2:00 AM | Updated on Jun 19 2026 2:00 AM

అడ్డంగా బుకై ్కన కడప పోలీసులు

సీసీ ఫుటేజీ, ఎస్‌ఐ ఐడీ కార్డుతో హైకోర్టులో గుట్టురట్టు

హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసినందుకు

బాధితులపై ‘పీడీ యాక్ట్‌’ పెట్టాలని పగ

సాక్షి ప్రతినిధి, కడప: ఎవరినో సంతోష పెట్టడానికి, మరొకరి కళ్లల్లో ఆనందం చూడాలనే తపనతో అమాయకులను కేసుల్లో ఇరికించబోయిన పోలీసులు ఇప్పుడు తాము తవ్విన గోతిలో తామే అడ్డంగా పడిపోయారు. ఒక అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి గంజాయి డ్రామా ఆడిన ఖాకీలకు, ఇప్పుడు హైకోర్టు ‘హేబియస్‌ కార్పస్‌’ ఉచ్చు దెబ్బకు చెమటలు పడుతున్నాయి.

లాడ్జి సీసీ ఫుటేజీతో సహా అన్నీ కోర్టుకు

జీవనోపాధి కోసం చైన్నె వెళ్లిన కడపకు చెందిన రియాజ్‌, అతుల్‌లను మే 12 అర్ధరాత్రి దాటిన తర్వాత కడప చిన్నచౌక్‌ పోలీసులు చట్టవిరుద్ధంగా, కిడ్నాప్‌ తరహాలో అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరినీ ఏపీ39జీజెడ్‌ 1608 నంబర్‌ గల స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో గుట్టుచప్పుడు కాకుండా కడపకు తరలించారు. తాము చేసిన పని ఎవరికీ తెలియదనుకున్న పోలీసుల అతి తెలివికి చైన్నె లాడ్జి యాజమాన్యం గట్టి షాకే ఇచ్చింది. కడప పోలీసులు లాడ్జిలో చొరబడి బాధితులను ఈడ్చుకెళ్లిన విజువల్స్‌ మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ య్యాయి. అంతటితో ఆగకుండా, దాడికి వచ్చిన కడప ఎస్‌ఐకి సంబంధించిన ఐడీ ఆధారాలు సైతం అక్కడ దొరికిపోయాయి. ఈ సాక్ష్యాలన్నింటినీ రియాజ్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించడంతో పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు.

గంజాయి డ్రామా ఫ్లాప్‌.. ఇప్పుడు పీడీ యాక్ట్‌ కుట్ర!

హైకోర్టులో పిటిషన్‌ నంబర్‌ 14533/2026 ద్వారా హేబియస్‌ కార్పస్‌ కేసు దాఖలవడంతో.. ఆ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి మే 15న కడప వన్‌టౌన్‌ పోలీసులు పాతబస్టాండ్‌ వద్ద వీరిద్దరినీ గంజాయితో పట్టుకున్నామంటూ తప్పుడు కేసు బనాయించి రిమాండ్‌కు పంపారు. అయితే ఈ అక్రమ గంజాయి కేసు కోర్టులో నిలబడకపోవడంతో జూన్‌ 15న వీరికి బెయిల్‌ మంజూరైంది. కాగా, తమ అక్రమాలను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించినందుకు ప్రతిఫలంగా.. బాధితులు ఇద్దరూ జైలు నుంచి విడుదల కాగానే వారిపై ఏకంగా పీడీ యాక్ట్‌ నమోదు చేయాలనే క్రూరమైన ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసమే గత మూడు రోజులుగా కడప సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో చిన్నచౌక్‌, వన్‌టౌన్‌ పోలీసులు స్పెషల్‌ టీమ్‌లతో కలిసి వాహనాలలో తిష్ట వేసి కూర్చున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement