– మూడు రోజులుగా ఏనుగుల గుంపు విధ్వంసం
సుండుపల్లె:శేషాచలం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన గజరాజుల గుంపులు సుండుపల్లె మండల పరిధిలోని ముడుంపాడు గ్రామ పంచాయతీలోని గోపాలకృష్ణపురం, నగిరి, ఆరోగ్యపురంతో పాటు మరికొన్ని సరిహద్దు ప్రాంతాలలోని పంట పొలాలలో మంగళవారం, బుధవారం అర్ధరాత్రి సమయాలలోవిరుచుకుపడ్డాయి. చేతికొచ్చిన మామిడి, కొబ్బరి తోటలను, వరినార్లను పూర్తిగా నాశనం చేశాయి. అలాగే పంట బోర్లు, నీటిసరఫరా పైపులైన్లు, పొలాల రక్షణకు వేసుకున్న కంచె కూసాలను సైతం ధ్వంసం చేసి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం తోటలలో మామిడికాయల కోతలు జోరుగా కొనసాగుతున్న తరుణంలో ఏనుగుల భయంతో తోటల్లోకి వెళ్లడానికి కూలీలు ససేమిరా అంటున్నారు. ఏనుగులు వరుసగా దాడులు చేస్తుండటంతో సుండుపల్లె, కేవీ పల్లె మండలాలలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గజరాజులు పల్లెలను ముట్టడిస్తున్నా అటవీ అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారే తప్ప, వాటిని అడవిలోకి తోలేందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని రైతాంగం మండిపడుతోంది.


