విద్యుత్‌ స్తంభం మీద పడి మహిళకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభం మీద పడి మహిళకు తీవ్ర గాయాలు

Jun 18 2026 1:41 AM | Updated on Jun 18 2026 1:41 AM

మదనపల్లె టౌన్‌ : విద్యుత్‌ స్తంభం మీద పడి ఓ మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని పాలెంపల్లె పంచాయతీ, సికారిపాలెంకు చెందిన చిన్న రాయుడు భార్య శాంతి (30) ఆధార్‌ కార్డు తీసుకునేందుకు తన చంటి బిడ్డను ఎత్తుకొని పాలెంపల్లెలోని సచివాలయం వద్దకు వెళ్లింది. అక్కడ విద్యుత్‌ స్తంభాలు కుప్పగా వేసి ఉండడంతో వాటి మీద కూర్చుని బిడ్డకు పాలు ఇస్తుండగా, ప్రమాదవశాత్తు స్తంభం కాలిమీదకు దొర్లి శాంతి కాలుకు తీవ్రగాయమైంది. బాధితురాలిని పుంగనూరు 108 సిబ్బంది చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు సూచించారు.

రెండు బైక్‌లు ఢీకొని రైతుకు..

మదనపల్లె టౌన్‌ : సామసేను గట్లపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్థుతం అతని పరిస్థితి విషమంగా మారింది. బి.కొత్తకోట పోలీసుల కథనం మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రంలోని రాయలపాడు మండలం, బాలేవారిపల్లెకు చెందిన రైతు గంగిరెడ్డి(60) సొంతపనిపై బైక్‌లో సరిహద్దులో ఉన్న బి.కొత్తకోట మండలం, గట్టుకు వచ్చాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా, సామసేను గట్లపై ఎదురుగా వచ్చిన మరో బైక్‌ గంగిరెడ్డి బైక్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు పరీక్షించి, అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రుయాకు రెఫర్‌ చేశారు. కుటుంబీకులు రైతును కర్ణాటకకు తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆటో–బైక్‌ ఢీకొని

మదనపల్లె టౌన్‌ : ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం కురబలకోట మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆసుపత్రి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకు చెందిన ఎస్‌. బాబాజాన్‌ (36) సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. కురబలకోట మండలం రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే ఆటో, బైక్‌ ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిని బాబాజాన్‌ను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టమాట లారీ బోల్తాపడి..

ములకలచెరువు : అదుపుతప్పి టమాట లారీ బోల్తాపడటంతోపాటు ఒక కారును ఢీ కొంది. ఈ సంఘటనలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... మదనపల్లె నుంచి మహారాష్ట్ర రాష్ట్రం పూణేకు టమాట లోడుతో వెళ్తున్న లారీ వేపూరికోట బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తాపడింది. సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కారును సైతం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న లోకేష్‌(25), లక్ష్మిదేవమ్మ(55)లకు స్వల్పగాయాలయ్యాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో గంట సేపు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. టమాటాలు నేలపాలయ్యాయి. సంఘటన స్థలానికి ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి చేరుకొని ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా జేసీబీ సహాయంతో పక్కకు జరిపించారు. గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement