సాక్షి, మదనపల్లె : మదనపల్లె వాసులకు చంద్రబాబు హామీలను నెరవేర్చకుండా పర్యటనకు రావడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో విద్య, వైద్యం నీరుగారిపోయిందని, మెడికల్ కాలేజీని గత ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని ప్రైవేటుకు ఇచ్చేందకు ప్రయత్నించి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. బీటీ కళాశాలలో ఇంటర్మీడియట్, పీజీ కోర్సులు లేకుండా చేశారన్నారు. కృష్ణా జలాలను కుప్పంకు తరలించుకుని కరువు ప్రాంతాలపై నిర్లక్షం చేస్తారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆక్రమణలు తొలగించి రోడ్లను వెడల్పు చేసి, సిగ్నల్ లైట్ సిస్టం తీసుకురావాలని, హబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కలికిరి, పీలేరు ప్రాంతాల్లో పరిశ్రమల కోసం తీసుకున్న భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహికులకు ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మదనపల్లెకు ఏయే హామీలు నెరవేర్చబోతున్నారో చంద్రబాబు ప్రకటించిన తర్వాతే ఇక్కడికి రావాలన్నారు. నాయకులు మండెం సుధీర్, నాగరాజుపాల్గొన్నారు.


