అమ్మ ప్రేమకు హద్దులు లేవు.. ఆమె బాధ్యతకు సమయపాలన లేదు. ఓ వైపు కుటుంబ పోషణ కోసం నమ్ముకున్న వృత్తిపై బాధ్యత, మరోవైపు బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్ష. ఈ రెంటినీ సమన్వయం చేస్తూ ఒక శ్రామిక తల్లి పడుతున్న తపన మదనపల్లె–తంబళ్లపల్లె ప్రధాన రహదారిలోని ఓ పెట్రోల్ బంకులో మంగళవారం సాక్షాత్కరించింది. సదరు మహిళ స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పంప్ ఉమెన్‌గా విధులు నిర్వహిస్తోంది. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఆమె కుమార్తె నేరుగా తల్లి పనిచేసే బంకు వద్దకు చేరుకుంది. వాహనాలకు పెట్రోల్ పోసే పని ఒత్తిడి నడుమ.. కాస్త ఖాళీ సమయం దొరికినా విసుగు చెందకుండా తన బిడ్డ పక్కన కూర్చుంటోంది. బంకు మెట్లపైనే కూతురిని కూర్చోబెట్టుకుని, ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ బుక్‌ను దగ్గరుండి పరిశీలిస్తూ, ఎలా రాయా లో ఓపికగా నేర్పిస్తోంది. బిడ్డను మంచి ప్రయోజకురాలిని చేయాలనే ఆ తల్లి తపన కన్నప్రేమకు, శ్రమజీవుల నిరంతర పోరాటానికి నిలువెత్తు అద్దం పడుతోంది. – మదనపల్లె సిటీ.


