పుంగనూరు: కాలం పడగ విప్పితే కన్నీళ్లే జీవితమవుతాయి. వృద్ధాప్యంలో కొడుకులు చేతికర్రలై నడిపిస్తారని ఆశపడ్డ ఆ వృద్ధ తల్లిదండ్రులకు.. ఇప్పుడు వారే ఆ కొడుకులకు కంటిచూపుగా మారాల్సి వచ్చింది. నడి వయసులో తమను మహారాజుల్లా చూసుకోవాల్సిన బిడ్డలు.. అంధత్వంతో కదలలేని స్థితికి చేరుకుంటే, ఏడు పదుల వయసులోనూ ఆ దంపతులు కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుంటూ కన్నప్రేమను పంచుతున్నారు. పుంగనూరులో వెలుగుచూసిన ఈ హృదయవిదారక గాథ, సమాజంలో మాసి పోని మానవత్వానికి.. కన్నప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
ఎలిమెంటరీ స్కూల్‌కు వెళ్లే
వయసులోనే అలుముకున్న చీకటి
మండలంలోని బత్తలాపురం గ్రామానికి చెందిన ఈటి అగిస్తి, జయమ్మ దంపతులు కూలీపని చేసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మోహన్‌కు ఇప్పుడు 36 ఏళ్లు, చిన్న కుమారుడు గోపినాథ్‌కు 34 ఏళ్లు. మోహన్ చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్‌లో చేరే సమయంలో హఠాత్తుగా కనుచూపు మందగించింది. ఆ విధి వంచన అంతటితో ఆగలేదు. అదే సమయంలో రెండో కుమారుడు గోపినాథ్ కూడా చూపు కనపడకుండా పడిపోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్ముకుని, అప్పులు చేసి ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఏ డాక్టరూ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోయారు. ఆ రోజు నుంచి ఆ పసివాళ్ల ఆలనా, పాలనా పూర్తిగా ఈ పేద తల్లిదండ్రులపైనే పడింది.
ఏడు పదుల వయసులో.. అవిశ్రాంత శ్రామికుడు
ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న ఈటి అగస్తి నిజానికి శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. కానీ, కన్నప్రేమ ఆ ముసలి దేహానికి కొండంత బలా న్ని ఇస్తోంది. ఏమాత్రం విసుగు చెందకుండా ఉద యం లేవగానే కొడుకులు మోహన్, గోపినాథ్‌లను చేతులు పట్టుకుని తీసుకెళ్లి కాలకృత్యాలు తీరుస్తాడు. ఉదయం 9 గంటలకల్లా ఇద్దరికీ స్వయంగా స్నానం చేయించి, అల్పాహారం తినిపించి, బట్టలు వేసి, తలకు నూనె పెట్టి దువ్వడం వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తండ్రే ‘అన్నీ తానై’ చూసుకుంటున్నాడు.
రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు
మరోవైపు తల్లి జయమ్మ వంటచేసి పిల్లలకు పెట్టడం, ఆ తర్వాత వృద్ధ దంపతులిద్దరూ కలిసి పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లడం వీరి దినచర్యగా మారింది. తాము పనికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ ఇంట్లో కదలలేని స్థితిలో ఉన్న ఇద్దరు కొడుకులను వదిలి వెళ్లడం వారికి ప్రతిరోజూ నరకప్రాయంగా మారుతోంది. ‘మా ముసలితనం మాకు భారమైపోతోంది. ఒంట్లో ఓపిక నశిస్తోంది. కానీ, మేము కనుమూస్తే మా ఇద్దరు అంధ కొడుకులను ఎవరు చూస్తారనే భయమే మమ్మల్ని బతికిస్తోంది’ అని ఆ వృద్ధ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటుంటే స్థానికుల గుండెలు చెరువవుతున్నా యి. వయసు ఉడిగిపోయినా, దేహం సహకరించకపోయినా కొడుకుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆ తల్లిదండ్రుల ప్రేమే.. ఆ చీకటి జీవితాలకు వెలుగు. ప్రభుత్వం స్పందించి ఈ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బత్తలాపురంలో గుండెలను పిండేస్తున్న వృద్ధ దంపతుల జీవన పోరాటం
అంధత్వపు చీకట్లలో కుమారులు
ఏడు పదుల వయసులోనూ
ఆరని కన్నప్రేమ
కూలీ పనులకు వెళ్తూనే.. ముప్పై ఏళ్లుగా కొడుకులకు అన్నీ తానైన తల్లిదండ్రులు


