పుంగనూరులో పచ్చసెగలు! | - | Sakshi
Sakshi News home page

పుంగనూరులో పచ్చసెగలు!

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. స్థానిక టీడీపీ ముఖ్య నేత (ఇన్‌ఛార్జ్‌) అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, సొంత క్యాడర్‌ను ఇబ్బంది పెడుతూ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారంటూ నియోజకవర్గానికి చెందిన కీలక అసమ్మతి నేతలు మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసమ్మతి నేతల భారీ భేటీ.. ఆరోపణల వెల్లువ!

మండల నాయకుడు సుబ్రమణ్యంరాజు, పట్టణ నేత మధుసూదన్‌రాయల్‌తో పాటు జనార్ధన్‌, పెద్దమోహన్‌నాయుడు, గంగులప్ప, నాగరాజాచారి, శివ, రాఘవరాయల్‌, సదుం వెంకట్రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వినోద్‌, దేవేంద్ర, అమర తదితర ముఖ్య నేతల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లి లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకత్వం సాగిస్తున్న అక్రమ దందాలను లోకేష్‌ ముందు ఉంచారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ గుడి వద్ద భక్తులపై జరుగుతున్న దాడులు, అక్కడ సాగుతున్న అక్రమ వసూళ్లపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఉద్యోగాల పేరిట రూ.5 లక్షల దందా!

దీనికి తోడు నియోజకవర్గంలో విద్యుత్‌ శాఖ (ట్రాన్స్‌కో) లో ఆపరేటర్‌ పోస్టుల నియామకానికి సంబంధించి స్థానిక నేత పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని వారు ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి దగ్గర నుంచి ఏకంగా రూ.5 లక్షల వరకు వసూలు చేశారని లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న మండల పార్టీ కన్వీనర్ల నియామకాలు చేపట్టాలని, అలాగే బోయకొండ దేవస్థానానికి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసి పార్టీని రక్షించాలని కోరారు.

లోకేష్‌ సావధాన పరిశీలన – చర్యలకు హామీ

నియోజకవర్గ నాయకుల ఆవేదనను, ఫిర్యాదులను నారా లోకేష్‌ సుదీర్ఘంగా, సావదానంగా విన్నారు. పుంగనూరులో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి, పార్టీని బలోపేతం చేసే దిశగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మార్పుతో పాటు అవినీతి ఆరోపణలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు అసమ్మతి వర్గ నేతలు వెల్లడించారు. ఈ పరిణామంతో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను కలకలం రేగింది.

టీడీపీ నేతపై లోకేష్‌కు ఫిర్యాదు

ఇన్‌ఛార్జ్‌ మార్పుపై హామీ

అవినీతి అక్రమాలతో పార్టీకి తీవ్ర నష్టం

అసమ్మతి నేతల ఆరోపణ

బోయకొండ దోపిడీ, ట్రాన్స్‌కో పోస్టుల్లో రూ.5 లక్షల వసూళ్లపై నివేదిక

సావదానంగా విన్న లోకేష్‌.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement