నేడు మొహర్రం మాసం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు మొహర్రం మాసం ప్రారంభం

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

చిన్నమండెం : నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం నుంచి మొహర్రం మాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు చిన్నమండెం మండల కేంద్రంలో గంధపు పీర్లను నిలబెట్టారు. మండల కేంద్రంలోని పీర్లమకాన్‌లో గంధపు పీర్లను నిలబెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటి నుంచి పది రోజుల పాటు మొహర్రం వేడుకలను నిర్వహించనున్నారు.

కారు ఢీకొని యువకుడికి గాయాలు

రామసముద్రం : మండలంలోని యంబాడి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. గాయపడిన శ్రీకాంత్‌ వివరాల మేరకు.. కురప్పల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రీకాంత్‌(27) తన ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌ రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విద్యార్థిని అదృశ్యం

సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన పదిహేడున్నరేళ్ల విద్యార్థిని అదృశ్యమైన ఉదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపాల్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. స్థానిక ఓ ప్రయివేటు జూనియర్‌ కళాశాలలో మైనర్‌ అయిన విద్యార్థిని చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాలేదు. విద్యార్థిని కోసం కుటుంబీకులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

మదనపల్లె టౌన్‌ : రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగుడు బంగారు గొలుసు చోరీ చేశాడు. మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై మదనపల్లె వన్‌ టౌన్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఏగవ కురవంకలో నివాసముంటున్న శ్రీనివాసులు భార్య భార్గవి టైలరింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం స్థానిక ఆర్‌ఆర్‌ వీధికి షాపింగ్‌కు వెళ్లింది. షాపింగ్‌ పూర్తయ్యాక నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా, స్థానిక సొసైటీ కాలనీ వద్దకు రాగానే హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన దొంగ.. భార్గవి మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు వెంటనే వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement