పులిచెర్ల (కల్లూరు): ఖరీఫ్ రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో ఆశలతో సాగు చేపట్టిన వారికి ప్రకృతి సహకరించడం లేదు. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మరోవైపు ప్రాజెక్టుల నుంచి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. పంట సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షాలు పడకపోవడంతో చెరువులు, వాగుల్లో చుక్కనీరు కూడా లేదు. బోర్లను నమ్ముకొని పంటలు సాగు చేద్దామంటే భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో రైతులు టమాటా సాగుకు సిద్ధం చేసుకున్న పొలాలను ఖాళీగా వదిలేశారు. ఈ ప్రభావం నర్సీరీలపై తీవ్రంగా చూపింది. మొక్కలు ముదిరిపోతున్నాయి. ఏంచేయాలో అర్థంకాక నర్సరీలు సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలు లేక నర్సరీల్లో నారు సిద్ధంగా ఉన్నప్పటికీ వారు సకాలంలో పంట సాగుచేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపడం లేదు.
ముదురుతున్న నారు
రైతులు నారు కొనుగోలు చేయకపోవడంతో నర్సరీల్లో టమాటా, వంగ, మిరప నార ముదురుతోంది. మండలంలో టమాటాకు గిరాకీ ఉండడంతో నర్సరీ యజమానులు ఎక్కువ విస్తీర్ణంలో నార పోశారు. మండలంలో దాదాపు 18 నర్సరీలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు సరిగా పడక పోవడంతో రైతులు సాగుకు మొగ్గు చూపలేదు. దీంతో నర్సరీల్లోని నారు ముదురుతోంది. వర్షాలు పడుంటే టమాటా సాగు చేసేవారు. అయితే ప్రస్తుతం వర్షాలు లేవు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి నారు పెంచిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా నర్సరీలో విత్తనం నుంచి నారుగా తయారు కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. అనంతరం 15 రోజులకు దాన్ని రైతులు అమ్ముకోవాల్సి ఉంది. కొనుగోలు చేసిన రైతులు ఆ నారును వెంటనే నాటాలి. ఆ తర్వాత నాటినా కాయలు కాస్తాయన్న నమ్మకం ఉండదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు నారును కొనుగోలు చేయడం లేదు.
ముందుకు సాగని ఖరీఫ్ సాగు
అడుగంటిన భూగర్భ జలాలు
నష్టపోతున్న నర్సరీల యజమానులు


